ఈనెల 16న అవతార్ 2 అనే చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి మంచి జనాదరణ పొందుతూ ఉంది. అవతార్ మొదటి భాగం 12 సంవత్సరాల క్రితం విడుదల అయ్యి సoచలనం సృష్టించింది. దానికి కొనసాగింపుగానే ఇపుడు అవతార్ రెండవ భాగం వచ్చింది.
మొదటి భాగం లాగానే రెండవ భాగం కూడా విమర్శకుల ప్రశంసలు పొందుతూ ఉంది. ప్రఖ్యాత దర్శకులు జేమ్స్ కామెరూన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. జేమ్స్ కామెరున్ ఇంతకు ముందు కూడా టైటానిక్, టెర్మినేటర్ వంటి ఉత్తమ చిత్త్రాలు దర్శకత్వం వహించారు, తాను తీసిన ప్రతీ చిత్రం లోనూ సామాజిక అంశాలు జోడించి టెక్నాలజీని భారీగా వినియోగించటం అతని ప్రత్యేకత.
ఇక అవతార్ చిత్రం మరియు దానిలోని సామాజిక అంశాలను పరిశీలించటమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం.
పెట్టుబడుదారీ విధానం – సామ్రాజ్యవాదం !
అవతార్ మొదటి భాగంలో భూమి మీద మనుషులు సుదూరంలో ఉన్న “పండోరా” అనే గ్రహంలో ఒక విలువైన లోహం ఉందని గుర్తించి , అక్కడ తవ్వకం జరిపి, ఆ ఖనిజాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటారు. అందులో భాగంగానే ఒక స్పేస్ షిప్ లో శాస్త్రవేత్తలు, మిలటరీ మరియు వైద్యులను పండోరా గ్రహం పైకి తీసుకెళ్తారు. అక్కడ వారు మైనింగ్గ్ చేద్దాం అనుకున్న చోట అడవిలో నివసించే ప్రజలు ఉంటారు. కాబట్టి అక్కడ మైనింగ్ జరపాలంటే అక్కడి ప్రజలను ఖాళీ చేయించాల్సిన అవసరం వస్తుంది.
వారిని ఖాళీ చేయించటం కోసం భూమి నుండి వచ్చిన ప్రజలు తమ ఆధునిక టెక్నాలజీ ని ఉపయోగించి, అక్కడ అవతార్ శరీరాల లోకి ప్రవేశిoచి, అవతార్లతో సంభాషించి, మొదట శాంతియుతంగా ప్రయత్నించి, కుదరకపోతే… అవతార్ లను బలవంతంగా అక్కడి నుంచి ఖాళీ చేయించాలని నిర్ణయించుకుంటారు. ఒక బృందం సామ్రాజ్యవాద సమయంలో ఎలాగైతే చదువు, నాగరికతల పేరుతో… ఆసియా, ఆఫ్రికా, అమెరికా ఖండాలలోని వలస దేశాలలో ప్రవేశించారో అలాగే ప్రవేశిస్తారు. అందులో భాగంగానే కథానాయకుడిని కూడా వారిలో కలిసిపోయి చివరికి వారిని ఆ ప్రాంతం ఖాళీ చేయించేలా ఒప్పించమని పంపిస్తారు.
కథానాయకుడు అనుకున్నట్టుగానే వారితో కలిసిపోయి వారి ఆచారాలు, విద్యలు నేర్చుకోని, వారిలో ఒకరిగా కలిసిపోతాడు. చివరగా వారు ఖాళీ చేయటానికి ఒప్పుకోక పోయేసరికి ఆ కథానాయకుడు భూమి మీద నుండి వచ్చిన సామ్రాజ్యవాదులకు ఎదురు తిరిగి, అవతార్లతో కలిసి పోరాడి విజయం సాధించి, భూమి నుండి వచ్చిన సామ్రాజ్యవాదులను తరిమి కొడతారు. ఇది మొదటి భాగం సారాంశం.
ఇక రెండో భాగంలో భూమి నుండి ఆక్రమణ దారులు మళ్ళీ శక్తి పెంచుకోని తిరిగి వచ్చినట్లు, కథానయకుడు ఆత్మ రక్షణ కొరకు తన కుటుంబం తో సహా సముద్రం పక్కన జీవించే మరో జాతి వద్దకు వెళ్ళి, అక్కడ రహస్యంగా ఉంటాడు. అక్కడికి కూడా భూమి నుండి వచ్చిన మనుషులు, వారు పవిత్రంగా భావించే టర్క్స్ అనే సముద్ర జీవులను వేటాడి వాటి మెదడులోని ఒక రసాయనాన్ని అమ్ముకోవటం చేస్తుండటం తెలిసి అక్కడ ప్రజలు తిరగబడటాన్ని చూయిస్తారు.
ఈ చిత్రం గురించి అందరూ గ్రాఫిక్స్, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు కానీ ఆ కథలో మిళితమయిన దోపిడీ, పోరాటాల గురించి మాట్లాడటం లేదు. పెట్టుబడిదారీ విధానం భూమి మీద నుండి తమ దోపిడీని ఇతర గ్రహాలలోని జీవుల (ఒకవేళ అవి ఉంటే, వాటి) మీదకు కూడా విస్తరించ గలదని అలాగే అన్ని రకాల జిత్తులు, ఎత్తుగడలు తమ దోపిడీ కోసం ఉపయోగిస్తారని చూయించారు. అలాగే పోరాట మార్గమే దోపిడీ వ్యవస్థని అంతం చేయగలదని సారాంశంలో చెప్పారు.
అలాగే రెండవ భాగంలో విభిన్న జాతుల మధ్య సామరస్యత ఎలా ఉండాలో చూపించారు. చివరగా పోరాటమే అన్నింటికి సమాధానం అని తేల్చి చెప్పాడు దర్శకుడు. అంతే కాకుండా సామ్రాజ్యవాదులు తమ దోపిడీ, లాభాలకోసం ఎంతకైన తెగిస్తారని కూడా ఈ సినిమా ద్వారా ఇంపుగా చూపించటం జరిగింది. ప్రధానమైన అంశం ఏమిటంటే చిత్రం చూస్తున్న ప్రేక్షకులు అవతార్లే గెలవాలని అందరూ ఖచ్చితంగా కోరుకుంటారు. సామ్రాజ్యవాద మేధావులు చెప్పినట్టుగా మనిషి స్వభావమే మోసపూరితమయినది అయినప్పుడు, ప్రేక్షకులు తమ భూగోళం నుండి వచ్చిన వారు గెలవాలని కోరుకోకుండా తమలాగా లేని వేరే గ్రహం వారు గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు?
“ఎందుకంటే మనిషి స్వభావమేమీ చెడ్డది కాదు కాబట్టి. సామ్రాజ్య వాదవిధానమే అసలు సమస్య” అనేది నిజం గనుక.
ఇక చివరగా విశ్వంలో వేరే జీవులు ఉన్నాయో లేదో ఇంత వరకు తెలియదు, కానీ సామ్రాజ్య వాదుల విధానాల్ని అడ్డుకోకపొతే వారు ఈ భూమిని ఇక్కడ ఉన్న జీవులన్నింటినీ సర్వనాశనం చేస్తారు అనేది మాత్రం నిజం. అందుకే బుద్దిజీవులు అందరూ కూడా అత్యంత వినాశకర స్వభావం కలిగిన సామ్రాజ్యవాద విధానాల అంతం కొరకు పోరాటాలు చేయాల్సి ఉంటుంది.
– ఆంజనేయ రాజు (Copied From: Tanyala Srinath garu) – Rajeshwer Chelimela, Jvv Telangana