[8 డిసెంబర్ ఆంధ్ర జ్యోతి దినపత్రికలో ప్రముఖ కవి, రచయిత నిఖిలేశ్వర్ గారు రాసిన వ్యాసం]
అనాది నుంచి ‘లోక్తంత్ర’ (ప్రజాస్వామ్యం) ఈ దేశ సాంప్రదాయమని, కౌటిల్యుడి రాజ్యతంత్రం, భగవద్గీత మార్గదర్శక సూత్రాలతో పాలన సాగిందని, ఈ దేశ ప్రజలు రాచరికాల్లో సుఖసంతోషాలతో జీవించారనే కాల్పనిక వాదాలతో ఆర్ఎస్ఎస్ చరిత్రకారులు మభ్యపెడుతున్నారు.
ఈ దేశ ప్రజలకు చారిత్రక వాస్తవాలు తెలియవనే భ్రమలో ఐసిహెచ్ఆర్ (ఇండియన్ కౌన్సిల్ హిస్టారికల్ రీసెర్చ్) ఇటీవల ‘ఇండియా: ది మదర్ ఆఫ్ డెమోక్రసీ’ (భారత్: ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి) పేరుతో ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించింది. దాని ఆధారంగా యూజీసి (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) అధ్యక్షుడు ఈ దేశంలోని గవర్నర్లకు, తాము సూచించిన అంశాలపై ప్రసంగాలు–సదస్సులు ఆయా విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేయమని లేఖ రాసాడు. ఆ అంశాలను స్థూలంగా పేర్కొంటూ, ‘చరిత్ర గుండెలపై బుల్డోజర్’ శీర్షికన డిసెంబరు 1వ తేదీ ‘సందర్భం’లో కె.శ్రీనివాస్ వ్యాఖ్యానించి హెచ్చరించినందుకు అభినందిస్తున్నాను. ఆయన భావిస్తున్నట్టు ‘ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఆధునిక ప్రజాస్వామ్యం అవతరణ వికాసాల నేపథ్యం పూర్తిగా వేరని, తొలినాటి సాముదాయిక వ్యవస్థలను చరిత్రాంశంగా అధ్యయనం చేయగలం కానీ, కొనసాగింపుగా భావించలేమని ఇప్పుడు విద్యాపరిశోధన రంగాలను ఆక్రమించిన కొత్త శక్తులకు తెలియదా?’ తెలియకేం! అన్నీ తెలిసే ఐసిహెచ్ఆర్ చరిత్రకారులు సమాధులు తవ్వి, చరిత్రను తిరగరాస్తూ తిరోగమన మార్గంలో పయనిస్తున్నారు.
ఈ దేశంలో బహుళ సాంస్కృతిక వారసత్వంపై దాడి చేస్తూ, ప్రాచీన గత వైభవ సూక్తి ముక్తావళిని వల్లిస్తున్నారు ఈ చరిత్రకారులు. ‘లోకతంత్ర’ (ప్రజాతంత్ర) అనే వారి పదజాలంతో, ఈ దేశం వేలాది సంవత్సరాలుగా ‘రాజరుషులు’ ఆదర్శవంతంగా పాలించారని అభివర్ణిస్తున్నారు. హరప్పా (మొహంజదారో) నాగరికత ప్రపంచానికే ‘స్వపరి పాలన’ అనే ప్రజాస్వామిక వ్యవస్థకు నమూనాగా నిలిచిందని చెబుతున్నారు. ‘కాప్ పంచాయత్’ (యూపీ, బిహార్, రాజస్థాన్ లలో కుల వైషమ్యాలను పెంచి, కులాంతర వివాహాలు చేసుకున్న వారిని దారుణంగా చంపిన రక్తచరిత్ర ఉన్నవి) వ్యవస్థ మన గ్రామీణ స్థాయిలో ప్రజాతంత్ర సంప్రదాయాలను కాపాడుతున్నదని బోధిస్తున్నారు.
ఇక మతపరంగా భక్తి ఉద్యమాలు సంస్కరణలకు దారితీసాయని ఒప్పుకుంటూనే, రాజులు–రాజవంశాలు ఈ దేశంలో ప్రాచీన పాలనా పద్ధతులను అనుసరించినతీరు ప్రజాస్వామికమేనని విశ్లేషిస్తున్నారు. అసలు రాచరికాలన్నీ నిరంకుశంగా ప్రజల శ్రమశక్తిని దోచుకుని, పీడించి, తమ వంశాలను పెంచి పోషించుకున్నాయనే చారిత్రక వాస్తవాన్ని వక్రీకరిస్తున్నారు.
ఏకాత్మ మానవతావాదమే తమ మూలసిద్ధాంతమని తరచుగా ప్రకటించే భారతీయ జనతా పార్టీ, ఆచరణలో మాత్రం పాలనాపరంగా ఫాసిస్టు మూలసూత్రాలనే అనుసరిస్తున్నది. కీలకమైన సంస్థలను, పాలనా యంత్రాంగాన్ని తమ అనుయాయుల చేతుల్లో పెట్టింది. భిన్న అభిప్రాయాలున్నవారిని, ప్రశ్నించేవారిని చివరికి రచయితలను, కళాకారులను రాజద్రోహులుగా ముద్రవేసి, జైల్లో వేసి నోరుమూయిస్తున్నది. రాజ్యాంగరీత్యా లభించిన మౌలిక మానవహక్కులను కాలరాస్తూ ‘మెజారిటేరియన్’ అనే మూకస్వామ్యాన్ని ఆయుధంగా ప్రయోగిస్తున్నది.
అడాల్ఫ్ హిట్లర్ (జర్మని), ముస్సోలినీ (ఇటలీ) నియంతలను ఆదర్శంగా తీసుకున్న ఆర్ఎస్ఎస్–బీజేపీ పాలకులు, సాంస్కృతికంగా ‘ఏకాత్మత’ అనే ఏకపక్షభావంతో ఫాసిజాన్ని అంచెలవారిగా అమలుచేస్తున్నారు. అందులో భాగంగానే భారతదేశ చరిత్రను ఆసాంతం తిరోగమన ఛాందసవాద దృష్టితో రచించి, ప్రాథమిక స్థాయినుంచి విశ్వవిద్యాలయాల దాకా నూరిపోసే పథకాన్ని యూజీసీ ఆదేశాలతో ఆచరణలో పెడుతున్నారు. ప్రస్తుతం ‘సనాతన ధర్మ పునరుద్ధరణ’ పేరిట, జాతీయోద్యమ కాలం నాటి ఉమ్మడి భారతీయ సంస్కృతి అనే జాతీయ భావనను ధ్వంసం చేసే ప్రయత్నంలో ఉన్నారు.
మరోవైపు వివిధ మతాల, కులాల, భాషల మనుగడ కోసం–అస్తిత్వం కోసం ఆరాటం. తమ ప్రత్యేక గుర్తింపు, హక్కులను కాపాడాలనే తాత్కాలిక ప్రయోజనాలవల్ల ‘జాతీయ విముక్తి పోరాట’మనే విప్లవ స్పృహకు ప్రజలు దూరమవుతున్నారు. యథాతథవాదం (స్టేటస్ కో), సర్దుబాటు ధోరణిలో చివరికి అనేక రకాల సామాజిక సంస్కరణలను తిరస్కరించే తిరోగమన దశలోకి నెట్టబడుతున్నారు. మత ఛాందసవాదుల ప్రాబల్యం పెరిగినకొద్ది సెక్యులరిజం అనే లౌకిక విధానం–జీవన పద్ధతి క్షీణిస్తున్నది. ఈ సమకాలీన భౌతిక–సామాజిక యథార్థాన్ని, ప్రజల మధ్యనున్న వైరుధ్యాలను అర్థం చేసుకోగలిగితే మన ఉమ్మడి సంస్కృతిని రక్షించుకోగలం.
భారత ఉపఖండంలోని వివిధ మతాలు, భాషలు, కులాల సహజీవనం, పరస్పర సహనం ఒక అనివార్యమైన చారిత్రక అవసరం. అయితే ఆయా సామాజిక–రాజకీయ వైరుధ్యాలు కూడా అంతే సహజం. వాటి పరిష్కార మార్గంలో, ప్రజా ఉద్యమాల క్రమంలోనే ప్రత్యామ్నాయాలు రూపొందుతాయి. అంతిమంగా ఆర్థిక–ఉత్పత్తి సంబంధాలు మౌలికంగా మారినపుడే ఒక మానవీయ సంస్కృతికి అవకాశం ఉంటుంది.
- రచయిత నిఖిలేశ్వర్