ఏడాది పాలనలో కాంగ్రెస్ సాధించిందేమీ లేదా?
ఉపాధి పనుల ప్రారంభోత్సవంలో ‘ప్రధాని’ ఫోటో పెట్టాల్సిందే
కేంద్ర నిధులతో అమలయ్యే పథకాలన్నింట్లోనూ ప్రధాని ఫొటో ఉండాల్సిందే
లేనిపక్షంలో కాంగ్రెస్ తీరును అడుగడుగునా ఎండగడతాం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరిక
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నవంబర్ 26న అన్ని గ్రామ పంచాయతీల్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేయడం ఆశ్చర్యంగా ఉంది. గ్రామాల్లో కొనసాగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు 90 శాతం నిధులిస్తోంది ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వమే.
గ్రామాల్లోని మొక్కల పెంపకం, రైతు వేదికలు, వైకుంఠధామాలు, రోడ్ల నిర్మాణం వంటివన్నీ కేంద్రం ఇస్తోన్న ఉపాధి హామీ పథకం నిధులతో జరుగుతున్నవే. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవి తమవిగా చెప్పుకుంటూ ఏడాది పాలనా విజయోత్సవాల పేరుతో ఉపాధి పనుల ప్రారంభించాలని ఉత్తర్వులు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. సొమ్ము కేంద్రానిదైతే… సోకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నట్లుగా కాంగ్రెస్ తీరు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిందేమీ లేక కేంద్రం నిధులతో అమలవుతున్న ఉపాధి పనులను విజయోత్సవాలుగా ప్రారంభించుకోవడం సిగ్గు చేటు.
నరేంద్ర మోదీ పాలనలో ఉపాధి కూలీలకు సమున్నత లబ్ది చేకూరుతోంది. యూపీఏ హయాంలో గ్రామీణ పేదలకు ఉపాధి దూరమైతే.. ఎన్‌డీఏ పాలనలో కోట్లాది మందికి వరంగా మారింది. గత పదేళ్లలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఒక్క తెలంగాణలోనే దాదాపు రూ.30 వేల కోట్ల మేరకు కేటాయించి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రభుత్వం నరేంద్రమోదీదే. ఇంత గొప్ప పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకునేలా గొప్పగా ప్రకటనలు చేసుకోవడం సిగ్గుచేటు.
Also Read-
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఉపాధి హామీ పథకం పనుల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో తప్పనిసరిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో ప్రదర్శించాలి. అంతేగాకుండా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నింటికీ ప్రధానమంత్రి ఫొటో తప్పనిసరిగా ఉండేలా సర్క్యులర్ జారీ చేయాలి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాలి. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజాక్షేత్రంలో అడుగడుగునా ఎండగడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.