హైదరాబాద్ : అనుకోని విపత్తు రాష్ట్ర ప్రజలను అల్లకల్లోలం చేసింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవటం అత్యంత బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. కొందరు కుటుంబ సభ్యులను కోల్పోయి ఆవేదన చెందుతుంటే, మరికొందరు నిరాశ్రుయులై రోడ్డు మీద పడ్డారు.
ఇంకొందరు పాడి, పంటలు కోల్పోగా, మరికొందరు ఉపాధి కోల్పోయి కన్నీరు పెడుతున్నరు. ఒక్కొక్కరిది ఒక్కో బాధ. విపత్తు కలిగించిన విషాద గాధ. ఇలాంటి ఆపత్కాలంలో ఒకరికొకరు భాసటగా నిలవాలి. చేయి అందించి భరోసా ఇవ్వాలి. రాజకీయాలకతీతంగా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలి.
రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలి. మరింత బాధ్యతగా మెలగాలి. ఆపదలో ఉన్న ప్రజలకు విశ్వాసం కలిగించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ఇంకా రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి.
Also Read-
రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయడంతో పాటు పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. ప్రజలను అప్రమత్తం చేయాలి. అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చూసుకోవాలి. ఏజెన్సీ, ముంపు ప్రాంతాల్లో ఉన్న గర్భిణీలను గుర్తించి ఆస్పత్రులకు తరలించాలి. దీంతోపాటు పాటు కాటు, విద్యుత్ షాక్‌లకు గురైన వారికి తక్షణ వైద్య సేవలు అందేలా చూడాలి.
ముంపు ప్రాంత ప్రజలను కాపాడేందుకు ముందస్తుగా కేంద్ర ప్రభుత్వ సహాయం కోరాలి. NDRF ను రంగంలోకి దించాలి. అత్యవసర సాయం అందించేందుకు హెలికాప్టర్లు సిద్దం చేసుకోవాలి. గల్లంతైన వారిని గుర్తించి ప్రాణాలు కాపాడాలి. వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, తాగునీరు అందించాలి. వైద్య సేవలు అందేలా హెల్త్ క్యాంపులు నిర్వహించాలి. ప్రభావిత ప్రాంతాలను ముందుగా గుర్తించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
టెంపరరీ రిలీఫ్ కోసం తక్షణం లక్ష ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడ్డ వారికి రూ 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి. కెసీఆర్ గారి ఆదేశాల మేరకు, అన్ని జిల్లాల్లోని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలి. కష్టకాలంలో ప్రజలకు తోడుగా నిలవాలని బిఆర్ఎస్ పార్టీ తరుపున మరొక్క సారి పిలుపునిస్తున్నాం.