మన మహిళలు, మహిళా సంఘాలు దేశానికే ఆదర్శం
మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
సిఎం కెసిఆర్ హయాంలోనే మహిళా సంఘాలు బలోపేతం
మహిళలు చిన్న తరహా నుంచి పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
మహిళలకు వారి అవసరాలకు తగినన్ని నిధులు రుణాలుగా ఇవ్వండి
మహిళలకు ఇచ్చే రుణాల నిబంధనలను సడలించండి
వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో ఒకే విధంగా ఉండేలా చూడండి
సర్వీసు చార్జీలు లేకుండా చూడండి
దేశంలో అత్యధికంగా మహిళల ద్వారానే 98శాతం రికవరీ
దేశంలో 57శాతం మహిళలకు రుణాలు అందుతుంటే, మన రాష్ట్రంలో 76శాతం రుణాలు మహిళలకే ఇస్తున్నం.
తెలంగాణ ఆవతరణ దశాబ్ధి ఉత్సవాలలో మహిళలు భాగస్వాములు కావాలి
సగటున ఒక్కో డ్వాక్రా మహిళకు రూ.5,56,556 రుణాలుగా అందించాం
ఈ ఏడాది సెర్ప్ బ్యాంకు లింకేజీ లక్ష్యం రూ.15,037.40 కోట్లు
2023-24 బ్యాంకు లింకేజీ వార్షిక ప్రణాళికను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
గత ఏడాది బ్యాంకు రుణాలతో చిన్న పరిశ్రమలు నెలకొల్పిన మహిళల విజయగాథల పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వివిధ కేటగిరీలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన మహిళలకు అవార్డులు అందచేసిన మంత్రి
హైదరాబాద్: మన డ్వాక్రా మహిళలు, మహిళా సంఘాలు దేశానికే ఆదర్శం. వాళ్ళు చేస్తున్న పొదుపు, రుణ విలువలు కూడా దేశ సగటు కన్నా ఎక్కువ. మరే రాష్ట్రంలోనూ ఇంతగా పని చేస్తున్న మహిళా సంఘాలు లేవు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. సిఎం కెసిఆర్ హయాంలోనే మహిళా సంఘాలు బలోపేతం అవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
హైదరాబాద్ లోని ఓ హోటల్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ ఏడాది 2023-24 సంవత్సరానికి సెర్ప్ – పేదరిక నిర్మూలన సంస్థ, బ్యాంకు లింకేజీ లక్ష్యం రూ.15,037.40 కోట్లుగా నిర్ణయించగా, ఈ బ్యాంకు లింకేజీ వార్షిక ప్రణాళికను మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించారు. అలాగే, గత ఏడాది బ్యాంకు రుణాలతో చిన్న పరిశ్రమలు నెలకొల్పిన మహిళల విజయగాథల పుస్తకాన్ని ఆవిష్కరించారు. వివిధ కేటగిరీలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన మహిళలకు, అధికారులకు అవార్డులు అందచేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, మహిళలు చిన్న తరహా నుంచి పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. మహిళలకు వారి అవసరాలకు తగినన్ని నిధులను బ్యాంకులు రుణాలుగా ఇవ్వాలి. వీలైనంత వరకు మహిళలకు ఇచ్చే రుణాల నిబంధనలను సడలించండి. వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో ఒకే విధంగా ఉండేలా చూడండి. సాధ్యమైనంత వరకు సర్వీసు చార్జీలు లేకుండా చూడండి. అంటూ బ్యాంకర్లకు సూచించారు. అలాగే దేశంలో అత్యధికంగా మహిళల ద్వారానే 98శాతం రికవరీ ఉంది. దేశంలో 57శాతం మహిళలకు రుణాలు అందుతుంటే, మన రాష్ట్రంలో 76శాతం రుణాలు మహిళలకే ఇస్తున్నం. సగటున ఒక్కో డ్వాక్రా సంఘానికి రూ.5,56,556 రుణాలుగా అందించాం. అని మంత్రి వివరించారు.
రాష్ట్రంలో 32 జిల్లాల్లో 98శాతం మహిళలు భాగస్వాములుగా డ్వాక్రా సంఘాలు పని చేస్తున్నాయి. 553 మండల సమాఖ్యలు, 4,30,358 స్వయం సహాయక సంఘాలలో 46,46,120 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. స్వయం సహాయక సంఘాల రుణ నిలువ ఈ ఏడాది 2023 మార్చి 31 నాటికి రూ.3,924.50 కోట్లుగా ఉంది. అని మంత్రి తెలిపారు.
2014-15 ఏడాది 3,738 కోట్లు రుణాలుగా ఇస్తే, 2022-23 ఏడాది 12,722 కోట్ల రుణాలు ఇచ్చాం. అంతకు ముందు తిరిగి ఇచ్చే చెల్లించే రుణాలతో పోలిస్తే, పొందే రుణాల విలువ పెరుగుతున్నది. రుణాలు తీసుకుని అభివృద్ధి చెందే స్థోమత పెరుగుతున్నది. ఈ మేరకు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 3,500 కోట్ల మేర రుణ విలువ పెరిగింది. మహిళలు ఆర్థిక, ఆదాయాన్నిచ్చే కార్యకలాపాలు కూడా పెరిగాయన్నది వాస్తవం. అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
అంతేగాకుండా, ప్రతి ఏడాది వినిమయ ఖర్చుల నుండి పెట్టుబడి ఖర్చుల శాతం పెరుగుతున్నది. గత ఏడాదిలో వినిమయ ఖర్చులు 12శాతం మాత్రమే ఉండగా, అంటే 88శాతం రుణాలుగా తీసుకుని, ఆదాయాన్నిచ్చే కార్యకలాపాలకు వినియోగించడం జరిగింది. 2014-15 సంవత్సరంలో మహిళా పంఘాలు బ్యాంకుల నుండి రూ.3,500 కోట్ల రుణాలు పొందేవి. క్రమేణా పెరుగుతూ 3 రెట్లకు చేరుకుని గత ఆర్థిక సంవత్సరంలో రూ.12,700 కోట్లకు చేరింది. అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
2014-15లో నిరర్థక ఆస్తులు 8.8శాతంగా ఉండేది. ఇది క్రమేపీ తగ్గుతూ మార్చి 31, 2023 నాటికి 1.62శాతానికి చేరుకుంది. బ్యాంకులు ఇచ్చే మిగతా ఏ రుణాలతో పోల్చినా, స్వయం సహాయక సంఘాల నిరర్థక ఆస్తులు చాలా స్వల్పం. దీని వల్ల బ్యాంకులు మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడానికి ఉత్సాహం కనబరుస్తూ ముందుకు వస్తున్నాయి. 2022 మార్చి 31 నుండి 2023 మార్చి 31 నాటికి ఏడాదిలో 16.5శాతం అప్పు నిలువ పెరిగింది.అని మంత్రి దయాకర్ రావు తెలిపారు.
అనేక అంశాల్లో మనమే నెంబర్ వన్
గ్రామీణ పేద మహిళలను స్వయం సంఘాలలో సభ్యులుగా చేర్చడంలో మన రాష్ట్రంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అదే విధంగా ఒక స్వయం సహాయక సంఘానికి సగటున రూ.10లక్షలు అంతకన్నా ఎక్కువ బ్యాంకు రుణం అందించడంలో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నాం. స్వయం సహాయక సంఘాలకున్న బ్యాంకు రుణ నిల్వలో మరియు ఒక్కొక్క గ్రూపు రుణ నిల్వలో దేశంలో ద్వితీయ స్థానంలో ఉన్నాం. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
రుణాలు తీసుకోవడం, బాగుపడటమే గాకుండా, బ్యాంకింగ్ సదుపాయంలేని చోట్ల మహిళా సంఘాల 680 మంది మహిళలకు వారం రోజుల శిక్షణ ఇచ్చి, అందులో 622 మంది మహిళలు (97శాతం)ఐఐబిఎఫ్ పరీక్ష ఉత్తీర్ణత పొంది, బ్యాంకింగ్ కరెస్పాండెంట్ గా నియమకానికి అర్హత పొందారు. ప్రస్తుతం ఈ మహిళలందరూ గ్రామాల్లో చిన్న చిన్న బ్యాంకింగ్ కార్యకలాపాలు (డిగీ పే సఖి) నిర్వహిస్తున్నారు.దీని మూలంగా ఆ గ్రామంలో బ్యాకింగ్ సదుపాయం కల్పించడమే గాకుండా, ఈ మహిళలు కమిషన్ ద్వారా ఆదాయం కూడా పొందుతున్నారు. అని మంత్రి వివరించారు. అలాగే మహిళలు పెద్ద ఎత్తున రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగస్వాములు కావలాని మంత్రి పిలుపునిచ్చారు.
మహిళల ఆలోచనలకు అనుగుణంగా బ్యాంకర్లు ఆలోచించాలి
రుణాలు ఇచ్చే పద్ధతులను మార్చుకోవాలి
-పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
మహిళల విజయగాథలను చూస్తుంటే మహిళల అవసరాలకు అనుగుణంగా బ్యాంకర్లు మారాల్సిన అవసరం కనిపిస్తున్నది. గత 25 ఏండ్లతో పోలిస్తే, ఇప్పుడు మహిళలు బాగా అభివృద్ధి చెందారు. వారి ఆలోచనల్లో పరిణతి కనిపిస్తున్నది. పలువురు మహిళలు తమ విజయ గాథలను వివరిస్తుంటే ఆశ్చర్యంగా ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు.
మనం విన్నది కొందరి గురించే… ఇంకా వినాల్సింది ఎంతో ఉందన్నారు. ఒక్క బేనిషాన్ విషయంలోనే కేవలం 4 ఏండ్లల్లో మహిళలు 100 కోట్ల రూపాయల వ్యాపారం చేశారని అభినందించారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందితే, ఆ కుటుంబమే గాక, రాష్ట్రం, దేశం కూడా బాగుపడుతుందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ మహిళా సంఘాల మహిళలు అనిత, మంజుల, లలిత, సంతోష లు తమ అనుభవాలను, విజయగాథలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ బిఐ ప్రతినిధి అమిత్, నాబార్డు సీజీఎం సుశీల చింతల, అనిల్ కుమార్, సెర్ప్ డైరెక్టర్ వై.ఎన్.రెడ్డి, సెర్ప్ లోని వివిధ విభాగాల డైరెక్టర్లు, వివిధ సంఘాల మహిళలు, అధికారులు, డిఆర్ డిఓలు, ఎపిడిలు, తదితరులు పాల్గొన్నారు.