పుస్తక సమీక్ష: శ్రీ వాల్మీకి మహర్షికి అక్షర కుసుమాంజలి

ఆసేతు హిమాచలం ఆదికవి వాల్మీకితో అనుబంధమే! తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా వల్మిడి గ్రామం అందులో ఒకటి. వాల్మీకిపురం కాలక్రమంలో వల్మిడి అయ్యింది. వల్మిడిలో వాల్మీకి ఆశ్రమము, తపమాచరించిన గుహ ఉన్నయి. ఈ ఆశ్రమములోనే సీతమ్మకు ఆశ్రయం ఇచ్చిండని ప్రతీతి. వల్మిడి గురించి ఆకుల పుల్లయ్య, వీరమల్ల సోమదేవ రాజు గ్రంథాలు వ్రాసినరు. ఆ కోవలో వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్ సంపాదకత్వంలో వెలువడిన ‘శ్రీ వాల్మీకి మహర్షికి అక్షర కుసుమాంజలి’ సంకలనము విలక్షణమైనది, విశిష్టమైనది. ఇందులో 102 కవులతో వ్రాయించిన కవితలు ఉన్నయి. వల్మిడి గురించి, వాల్మీకి గురించి, రామాయణం గురించి వైవిధ్యమైన వ్యక్తీకరణలు గ్రహించవచ్చు. వేముల శ్రీ సహస్రాధిక పద్యాలు వ్రాసిన కవి. అయినా శతాధిక కవులతో ఈ సంకలనం వెలువరించి పుణ్యాన్ని అందరికి పంచినరు. వేముల శ్రీ వక్కాణించినట్లు ‘వాల్మీకి జీవితం వసుధైక శాశ్వతం’. అటువంటి వాల్మీకి మీద వెలువరించిన ఈ సంకలనం కూడా శాశ్వతత్వాన్ని సంతరించు కొన్నది అనుటలో సందేహం లేదు.

వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్ 2020 సంవత్సరం తన సాహిత్య పర్యటనలో బమ్మెర, పాలకుర్తి, వల్మిడి గ్రామాలను సందర్శించినరు. అప్పుడు తనకు కలిగిన సంకల్పంతో పోతన, సోమన, వాల్మీకి మీద కవితా సంకలనాలు వెలువరించినరు. ఆ వరుసలో భాగమే ఈ సంకలనం. జనగామ కవిత్రయం, తను పొందిన “మణిపూసల వేమన” బిరుదులోని వేమనను కలుపుకొని “వాల్మీకి సోమన పోతన వేమన సాహిత్య వేదిక” ను నెలకొల్పి సాహిత్య సేవ చేస్తున్నడు. అంతకు ముందు “శ్రీ సాయి సరస్వతి విద్యా వికాస్” సంస్థ ద్వారా విద్యా వ్యాప్తి కార్యక్రమాలు చేసే వాడు.

ఈ సంకలనంలోని ప్రతి కవితా ప్రత్యేకమైనదే! అంశాలు అక్కడక్కడ పునరుక్తమైనా పునః పునః రసానుభూతి పొందవచ్చు. ఎవరి వ్యక్తీకరణ వారిదే కదా! కవులు తమ కవిత్వాన్ని వచనం, పద్యం, పాట, మంగళహారతి వంటి అనేక రూపాలలో ప్రకటించినరు. మణి పూసలు, మంజరీ రుద్రాక్షలు వంటి ఆధునిక ఛందో ప్రయోగాలు కూడా ఇందులో ఉన్నయి. గంట ఐశ్వర్య రెడ్డి ఉటంకించినట్లు “వాల్మీకిదే నామ భువిఖ్యాతం భవిష్యసి” అన్న సప్తర్షుల పలుకులు రామాయణ రచన వలన శాశ్వతమై నిలిచినయి.

సత్య మొండ్రేటి రామాయణంలోని సప్త కాండలను ఇంద్రధనుస్సు లోని సప్త వర్ణాలుగా అభివర్ణించింది. కళ్లెం లక్ష్మణ్ ప్రతి కాండం అమృత భాండం అంటడు. తెప్పల కృష్ణమూర్తి అన్నట్లు రామాయణం పారాయణ గ్రంథమే కాదు, ఆచరణ ప్రధాన మహా గ్రంథం. రామాయణాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భావిస్తరు. ఎన్నవెళ్లి రాజమౌళి రామాయణమే దేవాయణం, మాడుగుల మురళీధర శర్మ శ్రీరామచంద్రుని సీత చరిత అంటె, కుసునూరు భద్రయ్య రావణ కుంభ కర్ణాదుల శాపము తొలగ జేసిన తొల్లి గాథ అంటడు.

మూర్తీభవించిన ధర్మమూర్తి “శ్రీరాముడి జీవనయానమే రామాయణం” అంటడు గజవెల్లి సత్యనారాయణ స్వామి. రామాయణాన్ని “వినినంతనే కల్గు పూర్ణ విశ్వ జ్ఞానంబు” అంటడు రాయబారపు అశోక్. వాల్మీకి వేయి శ్లోకాలకు ఒకసారి బీజాక్షరాలను నిక్షిప్తం చేసిన విషయాన్ని లోడె రాములు గుర్తు చేస్తే, రామాయణాంతర్గతంగా ఆదిత్య హృదయం, వెంకటేశ్వర సుప్రభాతానికి పల్లవి పదాలైన కౌసల్యా సుప్రజా రామా, దేశభక్తి ప్రబోధకమైన జననీ జన్మభూమిశ్చ వంటి మరెన్నో అంశాలను పలువురు కవులు ప్రస్తావన చేసినరు. “పాపాత్ముని ఎదిరించ పక్షియైతే నేమి/ వారధిని కట్టుటకు వానరులైతే నేమి?!” అంటూ రామాయణంలోని సందేశాలను అర్థం చేయిస్తడు వడ్డేపల్లి నర్సింగరావు.

రామాయణ కథకు వాల్మీకి రచయితయే కాదు, కథలో పాత్రధారి కూడా! తంగెళ్ల అనందాచారి అంటడు: నడుస్తున్న కథలో తనూ నాయకుడాయే/ నిండు గర్భిణి జానకికి జనకుడుగ మారే – అని. రామసతికి వనమున కొండంత అండగ/ రామసుతులకు తాతగ… అంటూ వి సుబ్రహ్మణ్య హరగోపాల్ చెప్పుతడు. దీనినే మండ వీరస్వామి గౌడ్ తన పాటలో ప్రస్తావిస్తడు: సీతమ్మను అడవికంప ఆశ్రయమును ఇచ్చినాడు/ సీతాసుతులకు విద్యా బుద్ధులు బోధించినాడు – అని. వాల్మీకి “మహిని కవుల కెల్ల మార్గదర్శి యగుచు” ఆదికవిగ నిలిచిన విషయాన్ని బల్లూరి ఉమాదేవి వ్రాస్తే, “ధర్మ వర్తనులను పేరు దద్దరిల్ల/ భారతీయుల కీర్తిని ప్రభల జేసె/ అట్టి కవిరాజు వాల్మీకి నభినుతింతు” అని నుతిస్తడు కర్నాటి రఘురాములు గౌడ్.

“మనుజుడే భువియందు మనికి యుండిన దాక/ వాల్మీకి జీవించు ప్రతి యెడదను” అని చిరస్థాయిత్వాన్ని కీర్తిస్తది రాపోలు అరుణా స్వామి. “… శ్రీరామ చరితము నింపు గాను/ వ్రాసి తరియించె వాల్మీకి వాసి కెక్క” అంటడు మాచర్ల మల్లేశం. దోకురు రాములు వ్రాసిన “ఓం ఓం వాల్మీకి” పాట భక్తి పారవశ్యాన్ని కలిగిస్తది. ఈ పాట మరియు మోకాటి సంతోష్ కుమార్ వ్రాసిన “మంగళ మిదిగో ఓ మహర్షి శ్రీ వాల్మీకి మంగళ మిదిగో” మంగళహారతి వాల్మీకి జయంతి వంటి సందర్భాలలో పాడుకొనుటకు అనువుగ ఉన్నయి.

ఇందులో వల్మిడి ఊరు గురించి కూడా ప్రస్తావనలు ఉన్నయి. వరుకోలు లక్ష్మయ్య “వాసిగ ఋషివర్యుడీ సీమలో దిర్గ/ వల్మిడి పురమౌచు వాసిగాంచె” అంటడు. రసన “వాల్మీకి అలనాడు వాసముండిన ఊరు”, కొండ మోహన్ “మా ఊరు వల్మిడి మా గురువు వాల్మీకి”, చెరుకు రాములు ఊరి శివారులో ఉన్న ఏడు గుట్టల పేర్లు తెలుపుతూ “ఏడుకొండల వల్మిడి”, కూటికంటి సోమయ్య “వాసిగా వాల్మీకి వన్నె తెచ్చిన జిల్లా” అంటరు.

ఇంక సంకలనకర్త గురించి “వాల్మీకి కవితలు వాసిగా ముద్రించి/ వల్మిడి గ్రామాన వాసి గాంచె” అంటుంది ఏలూరు ధర్మావతి. “సాధు శీలుడైన సాయి చరణదాసు/ పుస్తకమ్ము దీసె పుణ్యమూర్తి” అంటడు విజయ కుమార్ ఎల్లంభట్ల. అదే పద్యంలో ముగింపు పాదం “వల్మిడి పుర వాస వరద రామ” చూస్తే, ఈ మకుటంతో విజయ కుమార్ భవిష్యత్ లో శతకం వ్రాస్తడు అనిపించింది.

లింగంపల్లి రామచంద్ర, ఐత చంద్రయ్య, టి గౌరీశంకర్, కుప్ప వాసుదేవ శాస్త్రి, రాపోలు సత్యనారాయణ, ఉండ్రాళ్ల రాజేశం, ఎన్నవెళ్ళి రాజమౌళి, వరుకోలు లక్ష్మయ్య, మదునూరి సూర్యనారాయణ శర్మ వ్రాసిన ముందుమాటలు సంకలన విశేషాలను విశదీకరిస్తున్నయి. ఆదికవి వాల్మీకికి అందమైన అక్షర కుసుమాంజలి అందించిన వేముల శ్రీ అభినందనీయుడు!

ప్రతులకు:
శ్రీ వాల్మీకి మహర్షికి అక్షర కుసుమాంజలి – సంకలనము,
సంపాదకుడు: వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్,
ప్రచురణ: వాల్మీకి సోమన పోతన వేమన సాహిత్య వేదిక మరియు శ్రీ సాయి సరస్వతి విద్యా వికాస్, నంగునూర్, సిద్ధిపేట,
పుటలు: 108+xxi, వెల: 121/-
ఫోన్: 9652256429

సమీక్షకులు:
డాక్టర్ రాపోలు సత్యనారాయణ
9440163211

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X