హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం పొలిటికల్ వారు కొనసాగుతుండగా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాజ్‌భవన్‌లో 74వ గణతంత్ర దినోత్సవాలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి ప్రథమ పౌరురాలు అయిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలు అందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈసారి గణతంత్ర వేడుకలు ఎక్కడ జరపాలి అనే అంశంపై కొంత సస్పెన్స్ కొనసాగింది. ఈ అంశం హైకోర్టు ముందుకు వెళ్లడంతో హైకోర్టు కీలక ఆదేశం ఇచ్చింది. పరేడ్ గ్రౌండ్స్‌లో గానీ లేదా ఇతర ఏ ప్రాంతంలోనైనా రిపబ్లిక్ డే వేడుకలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరేడ్ కూడా ఉండాలనీ, కేంద్రం గైడ్‌లైన్స్ పాటించాలని నిన్న స్పష్టం చేసింది. ఐతే టైమ్ ఎక్కువగా లేకపోవడంతో ముందుగా అనుకున్నట్లుగానే ఈసారి రాజ్‌భవన్ లోనే నిర్వహిస్తున్నారు. అక్కడే పరేడ్ కూడా ఉంది.
రాష్ట్రంలో కొంతకాలంగా గవర్నర్, ప్రభుత్వం మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోందని మనకు తెలుసు. ఆ ప్రభావం గణతంత్ర దినోత్సవాలపై పడటం దురదృష్టకరం అని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకల్ని సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరుపుతున్నారు. కరోనా కారణం చెప్పి.. ప్రభుత్వం రెండేళ్లుగా రాజ్‌భవన్ లోనే ఈ కార్యక్రమం జరిపిస్తోంది.
ఈ సంవత్సరం కరోనా లేకపోయినా కరోనా ఉందనే కారణం చెప్పింది. ఈ అభిప్రాయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. రాజకీయ సభలకు 5 లక్షల మంది ప్రజలను తరలించినప్పుడు లేని కరోనా గణతంత్ర దినోత్సవాలకు ఉందా అని ప్రశ్నించింది. ఈ క్రమంలో ప్రభుత్వం.. రాజ్‌భవన్‌లో పరేడ్‌తో సహా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. (ఏజెన్సీలు)