కేసీఆర్ ప్రభుత్వాన్ని 100 మీటర్ల లోతులో బొంద పెట్టమని వేడుకుంటున్నారు : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : “పాదయాత్ర దారి వెంట ఎవరిని కలిసినా దుఃఖం పొంగుకు వస్తుంది. ఆవేదన ఆవేశంగా మారి కేసీఆర్ ప్రభుత్వాన్ని 100 మీటర్ల లోతులో బొంద పెట్టమని వేడుకుంటున్నారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే బాగుపడతామని మా ఆడబిడ్డలు చెప్పారు” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో భాగంగా బుధవారం మహబూబాబాద్ కోర్టు సర్కిల్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

హాత్ సే హాత్ జోడో యాత్రకు ఘన స్వాగతం పలికి మహబూబాబాద్ కాంగ్రెస్ అడ్డా అని నిరూపించారు. పాదయాత్రలో ఆర్టీసీ కార్మికులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. నిరంకుశ పాలనలో తమను వేధిస్తున్నారని ఆవేదనగా చెబుతున్నారు. ఆర్టీసీలో 6200 బస్సులుంటే 3200 బస్సులు ప్రయివేటువే. 50 వేల మంది చేసే పనిని 40వేల మందితో వెట్టి చాకిరి చేయిస్తున్నారు. ఒకటో తారీఖున వచ్చే జీతాలు.. 8 వ తేదీ వచ్చినా రాలేదని కంట తడి పెట్టారు. అవకాశం వచ్చిన రోజు కేసీఆర్ సర్కారుకు కర్రు కాల్చి వాత పెడతామని కండక్టర్ శ్రీలత ఆవేదనగా చెప్పింది. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎవరూ సంతోషంగా లేరు.

ఈ ఊర్లో ఒక దుశ్యాసన ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ దుశ్యాసనుడు కలెక్టరమ్మ చేయిపట్టి లాగాడు. మెడికల్ కాలేజీ పేరుతో పేదల భూములు గుంజుకుండు. పేదల భూములను కుటుంబ సభ్యుల పేర్లతో రాయించుకున్నారని చెబుతున్నారు. ఇక్కడ రాక్షస పాలన సాగుతోంది. కలెక్టర్లకు, కౌన్సిలర్లకు, పోడు భూములకు, పేదలకు ఇక్కడ రక్షణ లేదు. ఈ ప్రాంతంలో మిర్చి రైతులు ఎక్కువ. నకిలీ విత్తనాలతో మిర్చి పంట దెబ్బతింది. నకిలీ విత్తనాలతో మిర్చి రైతులను మోసం చేసిన వారిపై పీడీ వ్యక్తులు ఎందుకు పెట్టరు? అప్పుల బాధతో 29 మంది రైతులు పురుగుల మందు తాగి చనిపోయారు. వారిలో 23 మంది గిరిజనులే. పంట పెట్టుబడి రెండింతలైంది. గిట్టుబాటు ధర లభించడం లేదు.

ఇది కూడా చదవండి:

ముఖ్యమంత్రే వరి వేస్తే ఉరి అంటే మేము ఎక్కడికి వెళ్లాలని రైతులు వాపోయారు. ఈ ప్రాంతానికి చెందిన సునీల్ నాయక్ ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ప్రాంతంలో గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువ. అనాడు ఇందిరమ్మ తల్లి ఉన్న పోడు, అసైన్డ్ భూములకు పట్టాలిచ్చారు. ఇవాళ హరితహారంతో పోడు భూములను లాక్కుంటున్నారు. ఈ దుర్మార్గాలకు, పాపాలకు కారణం కేసీఆర్ అని ప్రజలు నా దృష్టికి తెచ్చారు. కొత్త సంవత్సరంలో జనవరి 1, 2024న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన ఆదివాసీ, గిరిజనులకు పోడు భూముల పట్టాలిస్తాం. వారి ఆత్మ గౌరవాన్ని నిలబెడతాం. భూ నిర్వాసితులందరికి నష్టపరిహారం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. 40 వేల ఆర్టీసీ కార్మికులను చూసుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. చనిపోయిన 50 మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత కూడా మాదే. ఆ కుటుంబాల ఉసురు కేసీఆర్ కు తగులుతుంది. ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ కూడా ఇస్తాం.

317 జీవోతో పోలీసులు కూడా బాధపడుతున్నారు. పోలీసులకు ప్రతీ వారం సెలవు ఇచ్చి.. ప్రతీ నెల1వ తేదీన జీతాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. హోమ్ గార్డుల సమస్యలు తీరుస్తాం. మహబూబాబాద్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తొమ్మిదేళ్లయినా ఆ హామీని నిలబెట్టుకోలేదు. ములుగులో నా వ్యాఖ్యలపై బీఆరెస్ నేతలు పోలీసులకు పిర్యాదు చేశారు. రాజ్యాలను కూల్చి రాచరికాన్ని బొంద పెట్టిన చరిత్ర తెలంగాణది. రాష్ట్రంలో పాలన చూస్తుంటే రజాకార్లు మళ్లీ వచ్చినట్లు ఉంది. ఎక్కడ దోపీడీలు, కబ్జాలు జరిగినా అక్కడ బీఆరెస్ నేతలున్నారు. ఆపారమైన ఖనిజ సంపద ఈ ప్రాంతంలో ఉంది. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తే 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి. అయిన బయ్యారం కర్మాగారాన్ని ఎందుకు నిర్మించలేదు? దీనికి కారణం కేసీఆర్ కాదా.

ఇన్ని అక్రమాలకు పాల్పడిన కేసీఆర్ ను, ఆయన సామంత రాజు శంకర్ నాయక్ ను శంకరగిరి మాన్యాలకు తరిమే బాధ్యత మీపై ఉంది. కేసీఆర్ కాదు.. కింద పనిచేసే కుక్కలు వచ్చినా.. నెత్తి మీద కాలు పెట్టి తొక్కి.. పాతాళానికి పంపిస్తాం. ప్రగతి భవన్ లోపలికి పేదలకు ఎందుకు ప్రవేశం లేదు? మా పైసలతో కట్టిన ప్రగతి భవన్లో మాకు ప్రవేశం లేదా. ప్రగతి భవన్ కమీషన్ దార్లకు, తెలంగాణ ఉద్యమ ద్రోహులకు, పార్టీ ఫిరాయింపులకు అడ్డగా మారింది. అందుకే చెప్పా. ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతామని. కేసీఆర్ గుర్తు పెట్టుకో బిడ్డా….కొత్త ఏడాదిలో ప్రగతి భవన్ గడీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం.

ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఎందుకు?

అంతకుముందు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ప్రగతి భవన్ తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిందని, ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్ కు ప్రజలు వెళ్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వ్యతిరేక శక్తులకు ప్రగతి భవన్ అడ్డాగా మారిందని.. ఉద్యమద్రోహులంతా ఇప్పుడు అక్కడే చేరారని విమర్శించారు. అది ముఖ్యమంత్రి అధికారిక నివాసమని, ప్రజా దర్బార్ నిర్వహించడానికే ప్రగతి భవన్ ఉండాలన్నారు. నిజాం తనను తాను కాపాడుకోవడానికి రజాకార్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే.. పోలీసుల అండతో కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. గతంలో చంద్రబాబు, వైఎస్ ప్రజలను కలవలేదా? అని ఆయన అన్నారు.

ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఎందుకు? తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి గేట్లు బద్దలు కొడదామని ప్రజలకు పిలుపునిస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. అవసరమైతే ప్రగతి భవన్ ను నేలమట్టం చేసే బాధ్యత మేం తీసుకుంటామని, . నక్సలైట్ల ఎజెండా నా ఎజెండా అన్న కేసీఆర్ ను ఎందుకు అరెస్టు చేయరంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అదే తాను అంటే తనపై కేసులు పెట్టారన్నారు. ఇప్పుడు నేను మాట్లాడితే ఎందుకు తప్పుపడుతున్నారు? అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ద్రోహులకు, తన బంధువులకు మంత్రి పదవులు ఇవ్వాలని నక్సలైట్ల ఎజెండాలో ఉందా? అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజల ఆలోచననే నేను చెప్పానని, నిరంకుశ పాలన నుంచి శాశ్వత పరిష్కారం కోసం తుది దశ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అందుకోసమే మా యాత్ర అని, మేం గాంధీ వారసులం.. అహింసకు వ్యతిరేకమన్నారు రేవంత్ రెడ్డి. శాంతి కోసమే ఈ యాత్ర చేస్తున్నామని, తెలంగాణ వచ్చాక ఎన్ కౌంటర్ లు ఉండవని కేసీఆర్ చెప్పాడని, రాష్ట్రం వచ్చాక జరిగిన ఎన్కౌంటర్లకు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారన్నారు ? 9 నెలల్లో ప్రగతి భవన్, 12 నెలల్లో సచివాలయం కట్టారు. కానీ 9 ఏళ్లలో అమరుల స్థూపం కట్టలేకపోయారు. తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ ధనిక రాష్ట్రంగా మార్చుతామని, కేసీఆర్ చేసిన దుబారను నివారిస్తే.. తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X