[నేడు గురజాడ 100వ వర్ధంతి]
చాలామంది గురజాడ అప్పారావును కవిగా చూస్తారు, కానీ ఆయన ఒక పెద్ద ఫిలాసఫర్. ఆయన కన్యాశుల్కం రాయడానికి ముందు ఎన్నెన్నో రచనలు చేశారు. కానీ ఆయనగారి అద్భుతమైన నాటకం కన్యాశుల్కంలో అతనిలోని మానవతావాదం స్పష్టంగా కనిపిస్తుంది. కన్యాశుల్కములోని మాటలు వింటే అతను మూఢనమ్మకాల పైన, బాల్య వివాహాల పైన సంఘములో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఎక్కుపెట్టిన పదజాలం మనందరికీ అర్థమవుతుంది.
కనుకనే కన్యాశుల్కం ఒక అద్భుతమైన నాటకంగా తెలుగు సాహితీ చరిత్రలో నిలబడిపోయింది. ఆయన రచనలన్నీ ఒక ప్రత్యేకత చాటుకుంటాయి. ముత్యాల సరాలు అంటూ కొత్త ఛందస్సును సృష్టించుకుని సమాజంలో మూఢనమ్మకాలపై తిరుగుబాటు చేశాడు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మలో బాల్యవివాహాలపై జరుగుతున్న ఘోరాలను కళ్ళ ముందు ఉంచాడు. అలాగే కన్యకలో స్త్రీలకూ ఆత్మాభిమానం ఉందని దాన్ని కాపాడుకోవాలని బలంగా చాటి చెప్పాడు.
దేశభక్తి గేయంలో అడుగడుగునా మానవతా వాదాన్ని కళ్ళ ముందు ఉంచి అద్భుత గేయంగా రాశాడు. ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు ఎక్కువగా చదివేవాడు. ఆంగ్ల సాహిత్యాన్ని ఎక్కువగా అభిమానించి తనలో విశ్వమానవ కళ్యాణాన్ని నింపుకున్నాడు. సంస్కరణ భావాలను అడుగడుగునా చాటిలోక ప్రేమ కోసం నిర్మలమైన మనస్సుతో తాను సాహిత్యములో కొత్త ఒరవడి సృష్టించాడు.
వాడుక భాషకు పట్టం కట్టడానికి ప్రతి పదములోనూ తనదైన ముద్ర వేసుకుంటూ సాహిత్య లోకములో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
ఆయన దేశభక్తి గేయాన్ని పరిశీలిస్తే..
మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును- యెల్ల లోకము వొక్క యిల్త్లె, వర్ణ భేదము లెల్ల కల్త్లె- ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును- దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్- మంచిచెడ్డలు మనుజులందున, యెంచి చూడగ, రెండె కులములు- బ్రతికి చచ్చియు ప్రజల కెవ్వడు బ్రీతిగూర్చునొ, వాడె ధన్యుడు-
అంటూ గురజాడ మానవతావాదం చాటాడు. ఇది తత్వం కాదు. మతముకాదు. ఒక జీవన దృక్పథం. నిత్యనూతనంగా ప్రవర్తిల్లేది. ఇది ఒక సిద్ధాంతం మాత్రమేకాదు. సకల సిద్ధాంతాలనూ విశ్లేషించి వాటిలోని మానవతాభ్యుదయ ప్రోద్బల భావాలను నిరంతరంగా తనలో సంలీనం చేసుకొంటూ సాగే విశాల దృక్పథం. దాన్ని ఒక తత్వంగానో, మతంగానో పరిగణిస్తే దానిలో ఉన్న సహజత్వం, ఔన్నత్యం లోపిస్తాయి. మానవతావాదానికి స్వేచ్ఛ అవసరం. మానవుడిలో అంతర్గతంగా ఉన్న కోరిక స్వేచ్ఛ. స్వేచ్ఛే మానవ వికాసానికి దోహదం చేస్తుంది.
మానవతావాదానికి కావలసిన ముడిసరుకు ‘హేతువు’. సత్యంకోసం, జ్ఞానంకోసం మానవులు చేసే పోరాటంలో ఉపకరించే అమోఘమైన సాధనం హేతువు. హేతువు ద్వారా మాత్రమే మానవుడు తన శక్తినీ, పరిమితులనూ, సమాజాన్నీ అర్థం చేసుకోగలుగుతాడు. మంచి చెడుల్ని విశ్లేషించగలుగుతాడు.ఏ సమాజమైనా అభివృద్ధి చెందడానికి ఒక నీతి ఉండాలి. నైతిక విలువలు లేని సాహిత్యం సాహిత్యమేకాదు. నైతిక విలువలంటే దేవుడిమీద, మతంమీద ఉండే నమ్మకాలు కాదు. నీతికి పునాది మానవ స్వభావంలోనే ఉంటుంది. నీతి గా ఉండాలి అనే హేతువు నుంచే మనిషి నీతిగా ఉండడం నేర్చుకోవాలే తప్ప దైవానికో, ప్రభుత్వానికో, చట్టానికో భయపడికాదు.
మానవత్వపు ఉత్తమ లక్షణం- సహనం. ఏ సమాజంలోనైనా భిన్న నమ్మకాలు, విభిన్న తాత్విక దృక్పథాలు తప్పక ఉంటాయి. వాటిమధ్య ఐక్యతను సాధించడానికి ఉపయోగపడే సాధనమే సహనం. మనిషిలోని సహనం సామాజిక శాంతికి కారణమవుతుంది. మనిషిలోని అసహనం సమాజంలోని అల్లకల్లోలాకు కారణమవుతుంది. శాంతియుత నైతిక జీవనం సంఘంలో ప్రభవించడానికి సహనం తప్పని సరి. మానవవాదంలో ప్రేమకి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. సూర్యరశ్మిలా మలయమారుతంలా ప్రేమభావం మానవలోకాన్ని అలుముకోవాలి. మానవుల పరస్పర అవగాహన, సహానుభూతులనుంచి ఉద్భవించేదే ప్రేమ. ఇది మనిషి ఆటవిక ప్రవృత్తిని నాశనంచేసి, స్వార్థాన్ని నిర్మూలించి మనిషిని మనిషిగా నిలబెడుతుంది. మానవవాదం ఐక్యతను ప్రసాదిస్తుంది. స్వేచ్ఛ, జ్ఞానం, నీతి కోసం హేతువు, ఐక్యత ఉండాలి. ఐక్యత సహనం వల్ల కలుగుతుంది. గురజాడలో మత నిరసన, ఆచార నిరసన, విగ్రహారాధన నిరసన వంటివి ఉన్నా దైవభావనను అంగీకరించారు.గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా..
సాహిత్య వెలుగు జాడ మన గురజాడ..!!
తెలుగువారి అడుగు జాడ మన గురజాడ అప్పారావు. ఆధునికాంధ్ర సంస్కరణోద్యమం నేత అక్షర శిల్పుల అభినవ వేమన్న. కవిత్వానికి వెలుగుల రారాజుగా సంఘ సంస్కరణకు సాహిత్య దర్పణంగా అక్షరాలను ముత్యాల సరాలుగా మార్చి తెలుగు తల్లికి ముత్యాల హారము సమకూర్చెను. నవ్య కవిత్వానికి వేగుచుక్క లా నిలిచి, మూఢనమ్మకాలను ఎదిరించి సత్యము బోధించి
శాస్త్ర జ్ఞానాన్ని సమూలంగా అభ్యసించాలని వెర్రి మాటలను పక్కన పెట్టాలని చాటి చెప్పను. వాడుక భాషలో రచనలు చేసి కన్యాశుల్కం లో ప్రభంజనం సృష్టించి పూర్ణమ్మ తో ఆత్మాభిమానం చాటి కన్యక తో స్త్రీలకు స్థైర్యాన్ని పెంచినాడు. దిద్దుబాటుతో కథానికా కల్పన గావించి ముత్యాల సరాల పేరుతో నూతన ఛందస్సును సృష్టించి మట్టి కాదు దేశమంటే మనుషుల్ని ప్రేమించే దేశభక్తిని చాటిన నిజమైన దేశభక్తుడు.నూతన సాహిత్యాన్ని సృజించి తెలుగు భాషకు అమరత్వాన్ని అందించి
ఆధునికాంధ్ర కవిత్వానికి వెలుగునిచ్చెను. భాషకు పట్టం కట్టించి భావితరాలను మెప్పించెను.
సాహితీ సేవలో తరించి గిడుగుకు తోడొచ్చి,అక్షరాల ద్రష్ట స్రష్ట గా ఖ్యాతి గడించి, తెలుగు పదాలకు కొత్త దారి చూపించెను. వాడుక భాష విలువలు పెంచిన నిగర్వి. కొత్తపాతల మేలు కలయికతో నూతన కవితలెన్నో సృజించి, నవయుగ వైతాళికుడై వెలుగొందె పలుకులో పలుకుబడిని వినిపించిన సాహిత్యానికి జవసత్వాలు కల్పించి సరికొత్త జీవమును ప్రసాదించెను. ఆంగ్లము చదివిన అపర మేధావి, సత్యమూ తెలుసుకున్న సత్యవాది. సంఘానికి కొత్త ఊపిరి పోసెను. అక్షరాలకు అమరత్వము సిద్ధించెను. తెలుగు సాహితీ చరిత్రలో ఉజ్వల జ్యోతి ఆయన. జోహార్లు జోహార్లు గురజాడ అప్పారావు.
(ఈ రోజు ‘జన ప్రతిధ్వని’ పత్రికలో వ్యాసం)
– కొప్పుల ప్రసాద్, తెలుగు ఉపన్యాసకులు, నంద్యాల- 9885066235.