సాధారణ ఎన్నికలు రాంగనే రాజకీయ పక్షాలు ఆకట్టుకొనే మానిఫెస్టోలు ప్రకటించటం, ప్రజలు తమకు కావలసిన వాటి కోసం పరికించటం సాధారణంగా జరిగే విషయమే. తమకు మేలు చేసే అంశాలు కనిపిస్తే ఆనందం, లేకపోతే వాటిని చేర్పించాలని ఆరాటం సహజం. మ్యానిఫెస్టోలలో పేర్కొనే అంశాలలో వైద్య ఆరోగ్య రంగం కూడా ప్రధానమైనది. ఆరోగ్య రంగంలోని ఫార్మసిస్ట్ లు మానిఫెస్టోలలో ప్రతిసారీ విస్మరణకు గురి అయితున్నరు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈసారీ అదే జరిగినప్పటికీ ఆయా పార్టీల దృష్టికి తెచ్చి చేర్పించుకోవాలని ఫార్మసిస్ట్ లు తపన పడుతున్నరు. వైద్య రంగం అనంగనే మెడికల్ ప్రాక్టిషనర్ లు మాత్రమే నిష్ణాతులు అనే అభిప్రాయం ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కలిగి ఉన్నయి. ఈ అభిప్రాయం వలన నష్టపోతున్న ఒక వర్గం – ఫార్మసిస్ట్ లు. మెడిసిన్ చదివిన వారి ప్రాక్టిస్ – సూపర్ స్పెషలిస్ట్ లైనా – అంతా మెడిసిన్స్ మీదనే ఆధారపడి ఉంటది. అట్టి మెడిసిన్స్ ఉత్పత్తి తదితర సమస్త విషయాల విజ్ఞాన సమాహారం ఫార్మసీ. ఫార్మసీలో డిప్లొమా మొదలు పోస్ట్ డాక్టోరల్ ఫెలో వరకు ఉన్నత చదువులు ఉన్నయి.
2008లో అమెరికా నమూనాలోని ఫార్మ్ డి అనే 6 సంవత్సరాల క్లినికల్ కోర్స్ ప్రారంభమైంది. ఫార్మసీ ఒక మెడికల్ స్పెషాలిటీ. ఫార్మసీ నిపుణులను ఫార్మసిస్ట్ లు అంటరు. ఫార్మసిస్ట్ లు కమ్యూనిటీ, హాస్పిటల్, ఇండస్ట్రీ, రెగ్యులేటరీ, బోధన, పరిశోధన అభివృద్ధి వంటి పలు రంగాలలో సేవలు అందిస్తున్నరు. ప్రజలకు ప్రత్యక్ష సేవలు అందించేది మెడికల్ షాప్ లలో ఉండే కమ్యూనిటీ ఫార్మసిస్ట్ లు మరియు వైద్యశాలలలో ఉండే హాస్పిటల్ ఫార్మసిస్ట్ లు. కమ్యూనిటీ మరియు హాస్పిటల్ ఫార్మసిస్ట్ లు చదివిన ఉన్నత విద్యకు, వారి పట్ల ఉన్న సామాజిక దృష్టి, గుర్తింపు గమనిస్తే విలోమంగా కనిపిస్తున్నయి.
Read Also:
తెలంగాణ రాష్ట్రంలో 70 వేల ఫార్మసిస్ట్ లు ఉన్నరు. కోవిడ్ 19 నుంచి బయటపడటానికి ఫార్మసిస్ట్ లు అందించిన సేవలు అమూల్యమైనవి. ప్రపంచ స్థాయిలో తెలంగాణ ఫార్మా రంగానికి ఉన్న ప్రఖ్యాతి అందరికీ తెలిసిందే! ఫార్మసిస్ట్ ల జీవన ప్రమాణాలు, స్థితిగతులు మాత్రం అధోగతిలో ఉన్నయి. ఇది బాధాకరం.
మానిఫెస్టోలో చేర్చవలసిన అంశాలు:
- ఫార్మసీకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు
- కేంద్రం మరియు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విడుదల చేసే ఉత్తర్వుల ప్రకారం ఎప్పటికప్పుడు రాష్ట్ర రికార్డ్ ల సవరణ మరియు అమలు
- ఫార్మా సిటీలో ప్రభుత్వ రంగ ఔషధ పరిశ్రమ
- ఆరోగ్య శాఖలో ఫార్మసీ డైరెక్టరేట్
- అన్ని వైద్య కళాశాలలు, జిల్లా వైద్యశాలలలో హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు
- మెడికల్ కాలేజ్ ప్రాంగణాలలో బి ఫార్మ్ ప్రాక్టీస్ కళాశాలల ప్రారంభం
- వైద్యశాలలలో ఓ పి సెన్సస్, మంచాల సంఖ్యను పట్టి ఫార్మసిస్ట్ ల పెంపుదల
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ముగ్గురు ఫార్మసిస్ట్ లు
- పల్లె మరియు బస్తి దవాఖానలలో ఫార్మసిస్ట్ ల నియామకం
- సెకండరీ ప్రెస్క్రైబర్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ మరియు ప్రైమరీ హెల్త్ ప్రొవైడర్ లుగా ఫార్మసిస్ట్ లు.
- హాస్టల్స్, ఆవాస మరియు సాంకేతిక విద్యా సంస్థలలో ఆరోగ్య పర్యవేక్షకులుగా ఫార్మసిస్ట్ లు
- ఫార్మసిస్ట్ లకు ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగంలో సముచిత వేతనాలు, ప్రమోషన్ లు
- ప్రభుత్వ రంగంలోని తెలంగాణ సోషియల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫార్మసీ కాలేజ్ ఫర్ ఉమెన్ లో శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బంది
- ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ అమలు
- ఫార్మసిస్ట్ ల సొంత ప్రాక్టీస్ కు అనుమతి
- ఔషధాలు ఉన్న అన్ని చోట్ల ఫార్మసిస్ట్ ల నియామకం
- కమ్యూనిటీ ఫార్మసీ, ఫార్మసీ పరిశ్రమ ప్రారంభించటానికి ఫార్మసిస్ట్ లకు బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం.
- కమ్యూనిటీ మరియు చైన్ ఫార్మసీలలో పనిచేసే అందరూ ఫార్మసిస్ట్ లే ఉండే విధంగా చర్య.
- మెడికల్ షాప్ లు, పరిశ్రమల సంఖ్యకు అనుగుణంగా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ల సంఖ్య పెంపుదల
- హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ గా ఫార్మసిస్ట్ లకు సాధికారత
డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడు
పాలకుర్తి – 506146
ఫోన్: 9440163211