హైదరాబాద్: పోలీసులు గ్రేటర్ వరంగల్ బల్దియాలో సుమారు రూ. రెండు కోట్ల 32 లక్షల స్కామ్ కేసులో ఎనిమిది మంది నిందితులు అరెస్ట్రు చేశారు. ఈ స్కామ్ లో నిందితులు బండ అన్వేష్ తో పాటు అకౌంటెంట్ ఎనగందుల ఉమాకాంత్, ఆడిటర్ జన్నం సతీష్, అండ్ల నరేష్, పసుల పునేందర్, కొలిపాక సాయికృష్ణ, వెలకంటి రమణాచారి, బండ వీణ, బండ జ్యోత్స్నను సోమవారం మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ వెల్లడించారు.
వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయంలో మాజీ ఉద్యోగి బండా అన్వేష్ ఫోర్జరీ సంతకాలతో రూ.2.32కోట్లు కాజేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల కిందట చోటుచేసుకున్న ఈ స్కామ్ ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో బల్దియాతోపాటు నగర ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ అక్రమంలో కమిషనర్ సంతకం ఫోర్జరీ కావడంతో మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. అవినీతికి పాల్పడిన సమయంలో కమిషనర్ సీసీగా పనిచేసిన బండా అన్వేష్‌ను అప్పుడు సస్పెండ్ చేశారు.
తరువాత ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన మట్టెవాడ పోలీసులు చాకచక్యంగా ప్రధాన నిందితుడు అన్వేష్‌ను అరెస్ట్ చేయగా, కోర్టు రిమాండ్ విధించింది. కేసు దర్యాప్తు కోసం కోర్టు అనుమతితో అన్వేష్‌ను మూడు రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు. ఆ విచారణలో అన్వేష్తనకు సహకరించిన వారు, తాను కొట్టేసిన రూ.2.32 కోట్లు ఎలా వినియోగించింది? ఎవరికి బదిలీ చేసింది? అనే విషయాలు వెల్లడించాడు.
మరోవైపు వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ పర్యవేక్షణలో మట్టెవాడ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం తదుపరి దర్యాప్తునకు రంగంలోకి దిగింది. అందులో భాగంగా తొలుత అవినీతి జరిగిన సమయంలో వరంగల్ బల్దియాలో జూనియర్ అకౌంటెంట్‌గా పనిచేసిన ఎనగందుల ఉమాకాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మరిన్ని విషయాలు వెలుగు చూసి సాయి.
ఉమాకాంత్ అందించిన సమాచారం మేరకు మరో నిందితుడిగా ఆడిట్ సెక్షన్‌కు చెందిన జన్నం సతీశ్ ను సోమవారం అరెస్టు చేసి విచారణ చేపట్టారు. సతీష్ కూడా అవినీతికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు . దీంతో సతీష్ ను రిమాండ్ కు పంపారు. అన్వేష్, ఉమాకాంత్, సతీశ్ వెళ్లగక్కిన సమాచారం మేరకు నగదు డబ్బు బదిలీ కాబడిన మరో ఆరుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
అయితే అన్వేష్ కాజేసిన అవినీతి డబ్బులు అతని స్నేహితులు, అండ్ల నరేష్, పసుల పునేందర్, కొలిపాక సాయికృష్ణ, వెలకంటి రమణాచారి అకౌంట్లోకి మళ్లించారు. అలాగే అన్వేష్ చెల్లెలు బండ వీణ, బండ జ్యోత్స్న అకౌంట్ లోకి కూడా వేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, అన్వేష్ కొట్టేసిన సొమ్ములో కొంత ఫిక్డ్స్ డిపాజిట్ చేయగా, కొంత డబ్బుతో కుటుంబ సభ్యుల పేరిట స్థలం కొనుగోలు చేసినట్లు తెలిసింది.
జూనియర్ అకౌంటెంట్ ఎనగందుల ఉమాకాంత్, అలాగే జన్నం సతీశ్ చెరో రూ.40లక్షలు తీసుకోగా, వారు కూడా స్థలం కొన్నట్లు సమాచారం. సుమారు రూ.2 కోట్లకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నరు. నిందితులను త్వరలో కోర్టులో హాజరు పర్చనున్నారు.
ప్రజాధనం కొల్లగొట్టిన కేసును సీరియస్‌గా తీసుకోవడంతోపాటు అతి తక్కువ కాలంలో కేసును ఛేదించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బల్దియాలో గతంలో పలు అవినీతి బాగోతాలు వెలుగుచూసినప్పటికీ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. అయితే ఇప్పుడు ఈ కేసులో మట్టెవాడ పోలీసులు పురోగతి సాధించడంతోపాటు కొట్టేసిన సొమ్ముకు ఆధారాలు సేకరించిన తీరు అభినందనీయమని నగరవాసులు పేర్కొంటున్నారు. (ఏజెన్సీలు)