ఏతా వాతా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి పూర్వాపరాలు సామాన్య మానవుడికి కూడా ఈపాటికి అర్ధమై ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా చెప్పబడుతున్నఈ ప్రాజెక్ట్ ఎందుకోసం, ఎవరికోసం మొదలుపెట్టారు? మొత్తం ఖర్చు ఎంతవుతుంది? ఫలితం ఏ మేరకు ఉంటుంది? దీనివల్ల లాభమా? నష్టమా? ఈ మొత్తం వృత్తామ్తంలో లబ్దిదారులెవరు? స్థబ్దుదారులెవరు? ప్రజలేమంటున్నారు? ప్రభుత్వమేముంటుంది? సాంకేతిక నిపుణులేమంటున్నారు? మేధావుల మధనం వారి నివేదికలు ఎలా ఊన్నాయి? ఇత్యాది ప్రశ్నలు ప్రజల మస్తిష్కాలలో మెదలాడుతున్న అంతుపట్టని, అంతుచిక్కని వ్యవహారం, వ్యాకులత, వర్ణనాతీత వికృత వైపరీత్యం. దీని పర్యవసానం ఎలా ఉండబోతుందో పరీక్షిద్దాము.
ఈ ప్రతిష్టామకమైన ప్రాజెక్ట్ పై CAG (Comptroller and Auditor General of India) తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రానికి గుదిబండ అవుతుందని, ఆర్ధికంగా లాభదాయకం కాదని, ఖర్చు తడిసి మోపెడు అవుతుంది, ప్రయోజనం పెట్టిన ఖర్చుకన్నా చాలా తక్కువగా ఉంటుందని తన నివేదికలో పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ కు వాడే విద్యుత్తు పై పెట్టే ఖర్చు, వచ్చే ప్రయోజనాలకంటే ఎక్కువగా ఉండటమే చేసిన తప్పిదము. సుమారు 8,450 మెగావాట్ల విద్యుత్తు అవసరముంటుందని అంచనా. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో సుమారు సగానికి పైనే ఈ ప్రాజెక్ట్ పై వినియోగించవలసి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణా రాష్ట్రం విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితులు వచ్చే ప్రమాదం లేకపోలేదు.
CAG నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే ఖర్చు మొదలుపెట్టినప్పుడు 81,911 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఆచరణలో ఇది 1,47,000 కోట్ల రూపాయల వరకు చేరుకోవచ్చని CAG తన నివేదికలో పేర్కొంది. విద్యుత్తుకు Rs.10,375 కోట్లు, కార్యాచరణ నిర్వహణ ఖర్చుకు Rs.273 కోట్లు అవుతుందని CAG అంచనా వేసింది. ఒక ఏడాదికి అయ్యే మొత్తం ఖర్చు Rs.10,648 (Rs.10,375 + Rs.273) కోట్లు అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ వల్ల ఒక ఎకరానికి అందించే సాగు నీటి ఖర్చు Rs.46,364 అవుతుంది. దీనికి అదనంగా ఇతర ఖర్చులు కూడా ఉండనే ఉంటాయి. ఇదికాక ఏడాదికి తరుగుదల ఖర్చు Rs.2,760 కోట్లు అవుతుందని అంచనా. అన్నీ కలిపితే ఎకరానికి సుమారు Rs.50,000 ఖర్చు అవుతుంది.
ఇది కూడా చదవండి:
ఖర్చు ప్రయోజన నిష్పత్తి (Cost Benefit Ratio) ని CAG లెక్కకట్టింది. అప్పటి State Government తన DPR (Detailed Project Report) లో విద్యుత్తు ఖర్చును చాలా తక్కువ చేసి చూపించిందని, వచ్చే ప్రతిఫలం చాలా ఎక్కువచేసి చూపించిందని CAG తన నివేదికలో ఆరోపించింది. విద్యుత్తు మొత్తం వినియోగంలో సుమారు 60% బైటనుంచి రాష్ట్రం కొనుగోలు చేస్తున్నది. అప్పుడు కరెంట్ ఒక యూనిట్ కు Rs.3 గా ఖర్చు DPR లో చూపించారు.
వాస్తవానికి ఒక యూనిట్ కి Rs.6.40 ఖర్చు పెడుతున్నారు. విద్యుత్ పై పెట్టే ఖర్చు రెట్టింపు అవుతున్నది. అంటే, సుమారు ఒక రూపాయి ఖర్చు పెడితే 75 పైసల ఫలితం కూడా రాదు. భవిష్యత్తులో ఒక రూపాయికి 52 పైసలు మాత్రమే ప్రతిఫలం లభిస్తుందని CAG తన నివేదికలో పేర్కొంది. అప్పటి ప్రభుత్వ అంచనాల ప్రకారం ఒక రూపాయి ఖర్చు పెడితే రూపాయిన్నర ఫలితం వస్తున్నట్లు చూపించారు. సహజంగా ఎంతోకొంత ఖర్చుకు మించిన ఆదాయాన్ని మనం ఆశిస్తాము. కానీ ఇక్కడ పెట్టిన ఖర్చు కూడా రాకపోగా, నష్టం వస్తుందని గమనించాలి.
Kaleswaram Project వల్ల మల్లన్న సాగర్ జలాశయంలో 50 TMC లకు పైగా నీటిని నిల్వ చేస్తున్నారు. దీనిపై Rs.6,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశముందని National Geophysical Research Institute (NGRI) గతంలో ఒక ప్రాధమిక నివేదికలో పేర్కొంది. అయినా, గత ప్రభుత్వం అనాలోచితంగా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను చేపట్టింది.
CAG నివేదికను ఆధారంగా చేసుకొని, రాజకీయాలకు అతీతంగా, పాలక, ప్రతిపక్షం వారు ఒకరిపై ఒకరు బురద చల్లుకోకుండా, సమగ్రమైన చర్చ జరగాలని నిపుణులు సూచిస్తున్నారు. Public Accounts Committee లో కూడా దీనిపై చర్చలు జరుపుతున్నారు. చేసిన పని తీవ్రమైన నేరపూరిత నిర్లక్ష్యం అవుతుంది. శాస్త్రీయంగా వాస్తవాలు బైటికిరావాలి. గత ప్రభుత్వం దాటవేత ధోరణిలో కాకుండా తమ జవాబుదారీ తనాన్ని నిరూపించుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు ఒక గుదిబండగా, White Elephant గా మారింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ తల – తోక లేనిదిగా తేలిపోయింది.
ఇప్పుడున్న పరిష్టితులనుబట్టి, ఇప్పటికే రాష్ట్రం నష్ట పోయిందని, ఈ భారీ తప్పిదానికి ఇంతటితో చరమగీతం పాడితేబాగుంటుందని ప్రజలు అభిప్రాయం పడుతున్నారు. ముందుకెళ్లి ప్రాజెక్ట్ ను పూర్తిచేయాలంటే ‘సమస్య’ పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డట్లు అవుతుందేకానీ, పెట్టిన ఖర్చు వెనక్కు రాదు. ఈ తప్పిదానికి బాధ్యులైన వారిపై తాత్సారం చేయకుండా చట్టబద్ధంగా తగిన చర్యలు తీసుకోవాలి. అవినీతికి పాల్పడిన అధికారులు మరియు నాయకుల ఆస్తిని జప్తు చేసి వసూలు చేసి ప్రభుత్వ ఖజానలో జమా చేయాలి. తెలంగాణ బాగుపడడం కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను శాశ్వతంగా మూసివేయడం మంచిది.
Dr Sheik Mohammad