మునుగోడు, నల్లగొండ నియోజకవర్గలలో బి ఆర్ యస్ ఆత్మీయ సమ్మేళనాలు

గులాబీ జెండాతో జీవితాల్లో వెలుగులు

ఆరు ఏండ్లలో ఫ్లోరిన్ విముక్తి

రైతుబందు,రైతు భీమా అమలు జరుగుతుంది ఒక్క తెలంగాణా లోనే

ఇంటింటికి మంచినీటి సరఫరా ఇక్కడే

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ నందిస్తున్న ఏకైక రాష్ట్రం

కళ్యాణాలక్ష్మి/షాది ముబారక్ ల అమలూ ఇక్కడే

2014 కు మోసిన జెండాలు ఈ పథకాలు ఎందుకు ఇవ్వలేదు

కాంగ్రెస్,బిజెపి రాష్ట్రాలలో తెలంగాణా చర్చ మొదలైంది

బిజెపి కీ వణుకు మొదలైంది

హస్తిన పీఠం కదులుతుందన్న భయం మోడీని వెంటాడుతోంది

అందుకే తెలంగాణా ను చీకట్లోకి నెట్టే కుట్రలకు తెర లేపారు

తెలంగాణా కు రావాల్సిన 30 వేల కోట్లు అడ్డుకున్నారు

రేపో మాపో విద్యుత్ చార్జీలు 20% పెంచాలి అంటూ తాఖీదులు జారీ చేశారు

మోటర్లకు మీటర్లు పెట్టాలి అంటూ మెడ మీద కత్తి పెట్టిండ్రు

కాంగ్రెస్,బిజెపి లు అబద్ధాలను నిజంలా నమ్మించ చూస్తున్నారు

అవే అబద్ధాల తో బిజెపి కాంగ్రెస్ లు ఉరేగుతున్నాయి

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన నీరాజనం

కాంగ్రెస్ సుప్తచేతనావస్థితికి చేరుకుంది

బిజెపి కి బి ఆర్ యస్ ప్రత్యామ్నాయం

అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పై మోడీ దాడి

ముఖ్యమంత్రి కేసీఆర్ ను బలహీనం చేస్తే తెలంగాణాను బలహీనం చేసినట్లే

కేసీఆర్ జీవితం మూడున్నర కోట్ల తెలంగాణా ప్రజల జీవితాలతో ముడిపడింది

– మంత్రి జగదీష్ రెడ్డి

హైదరాబాద్ : గులాబీ జెండాతో తెలంగాణా ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలో కేవలం ఆరు ఏండ్ల వ్యవధిలోనే ఫ్లోరోసిస్ ను పారద్రోలింది అంటే అది గులాబీ జెండా శక్తి అని ఆయన పేర్కొన్నారు. రైతు బంధు, రైతు భీమా పథకాలు యావత్ భారతదేశం మొత్తంలో ఒక్క తెలంగాణా రాష్ట్రంలో అమలౌతున్నాయి అంటే అది గులాబీ జెండా కున్న పవర్ మాత్రమే నని ఆయన చెప్పారు.

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మునుగోడు మండల కేంద్రంలో, నల్లగొండ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామంలో జరిగిన బి ఆర్ యస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మునుగోడు మండల కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి మునుగోడు శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించగా జడ్ పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, జడ్ పి టి సి స్వరూప రవీందర్ ముదిరాజ్,యం పి పి స్వామి యాదవ్ నాయకులు మునగాల నారాయణ రావు, పల్లె రవికుమార్ గౌడ్, వేనేపల్లి వెంకటేశ్వర రావు, డోకురి శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అదే విదంగా నల్లగొండ మండలం అప్పాజీపేట గ్రామంలో జరిగిన సమ్మేళనానికి స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అధ్యక్షత వహించగా TSEWIDC చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి మైనార్టీ నాయకులు నిరంజన్ వలి,కటికం సత్తయ్య గౌడ్, చీర పంకజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా మండల కేంద్రాలలో జరిగిన సభలలో మంత్రి జగదీష్ రెడ్ది మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరధ తో ఇంటింటికి మంచినీరు అందించే పధకం సైతం గులాబీ జెండా ఎగురుతున్న తెలంగాణా రాష్ట్రంలో మాత్రమే ఉందన్నారు.

చీకట్లను పారద్రోలి 24 గంటల నిరంతర విద్యుత్ ప్రసారం అయ్యేది ఒక్క తెలంగాణా లోనేనని అదే గులాబీ జెండాను అక్కున చేర్చుకున్నందుకే వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతుంది కుడా ఒక్క తెలంగాణా లోనేనని ఆయన చెప్పారు. పేదింటి ఆడపిల్లలను అక్కున చేర్చుకోవడమే కాకుండా వారి పెళ్ళిలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కానుకగా అందించే కళ్యాణలక్ష్మీ/షాది ముబారక్ పథకాల అమలు గులాబీ జెండా ఎగురుతున్న తెలంగాణా రాష్ట్రంలో నన్నది ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

2014 కు ముందు 75 ఏండ్లుగా మోసిన జెండాలు ఈ పథకాలు ఎందుకు ఇవ్వలేక పోయాయని ఇప్పుడు ఎలా ఇస్తున్నారని జరిగిన మార్పును కులంకుశంగా అధ్యయనం చేయాలని ఆయన కోరారు. జరిగిన మార్పు అల్లా 2014 కు పూర్వము కేసీఆర్ లేక పోవడం గులాబీ జెండా అధికారంలోకి రాకపోవడం మాత్రమే నన్నారు.అంతెందుకు బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇప్పటికి ఈ తరహా పథకాల ఊసే లేదన్నారు. దాంతో కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాలలో ప్రజలు చర్చకు తెర లేపడం తో కమలనాధులలో వణుకు మొదలైందని ఆయన చెప్పారు. హస్తిన పీఠం కదులుతుందన్న భయం మోడీ ని వెంటాడుతుందన్నారు.

అందుకే తెలంగాణా ను మళ్ళీ చీకట్లోకి నెట్టే కుట్రలకు బిజెపి తెర లేపిందని ఆయన ఆరోపించారు. తెలంగాణా కు కేంద్రం నుండి రావాల్సిన 30 వేల కోట్లు మంజూరు కాకుండా అడ్డుతగులుతున్నారని ఆయన మండిపడ్డారు. రేపో మాపో ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు విద్యుత్ ని వినియోగించే వినియోగదారుల పై 20%చార్జీలు పెంచాలి అంటూ మోడీ సర్కార్ రాష్ట్రానికి తాఖీదులు పంపిందన్నారు. అంతే కాకుండా మోటర్లకు మీటర్లు పెట్టాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి మరీ వత్తిడి తెస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్,బిజెపి లు అబద్ధాలను నిజంలా నమ్మించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. అవే అబద్దాలతో ఆ రెండు పార్టీల నేతలు ఉరేగుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.

మహారాష్ట్రలో జరిగిన బి ఆర్ యస్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు అక్కడి ప్రజలు నీరాజనం పలికారన్నారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ సుప్తచేతనావస్తితికి చేరుకుందన్నారు.బిజెపి కి ప్రత్యామ్నాయం ఉందీ అంటే అది బి ఆర్ యస్ మాత్రమే నని ఆయన తేల్చిచెప్పారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పై బిజెపి దాడి మొదలు పెట్టిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను బలహీనం చేసే కుట్రలకు ప్రణాళికలు రూపొందించారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను బలహీన పరిస్తే తెలంగాణా సమాజాన్ని బలహీన పర్చినట్లు అవుతుందన్న వాస్తవాన్ని తెలంగాణా సమాజం గుర్తించాలన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితం మూడున్నర కోట్ల తెలంగాణా ప్రజల జీవితంతో మమేకం అయి ఉందన్న వాస్తవాన్ని బిజెపి జీర్ణించుకోలేక పోతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X