తెలంగాణ చరిత్రలో అత్యంత భారీ వర్షం
ములుగు జిల్లా వాజేడులో 2013 జులై 19న
గత 24 గంటలలో 517.5 మిమి వర్షం
గత 24 గంటలలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 649.8 మిమీ (64 సె.మీ) వర్షం
గత 24 గంటలలో రాష్ట్రంలోని
35 ప్రాంతాల్లో 20 సెం.మీ పైన వర్షం
200ల కేంద్రాల్లో 10 సెం.మీ పైగా వర్షం
—————————–
మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు రెస్క్యూటిమ్, NDRF బృందాలు మొరంచపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకున్న 200 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ…
హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొరంచపల్లి గ్రామంలో వరదలో చిక్కుకున్న 200 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. రెస్యూ చేసిన వారందరినీ కరకపల్లి విలేజ్ లోని పునరవాస కేంద్రాలకు తరలించామని వారికి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటుచేసి వైద్య చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
పునరావాస కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసామని, ఆహారం, నీరు, దుస్తులు, దుప్పట్లు, మందులను ఏర్పాటు చేసి వారికి అధిస్తున్నామని తెలిపారు. ఉదయం వాతావరణం అనుకూలించకపోవడంతోని హెలికాప్టర్ ద్వారా రక్షణ చర్యలు చేపట్టలేకపోయామని కొంత ఆలస్యం జరిగిందని, ఇప్పుడు హెలికాప్టర్లు చేరుకున్నాయని, ఇండ్లపై, చెట్లపై వరదల్లో చిక్కున్న వారందరిని రక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ఆదేశాలతో ప్రజాప్రతినిధులు,అధికారులు మేమంతా అండగా ఉన్నామని ఎవరు అధైర్య పడద్దని మంత్రి తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లోనూ కొంత మంది విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాని అన్నారు మంత్రి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి సహాయక చర్యల్లో సహకరించాలని మంత్రి ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు.
భారీ వర్షాల కారణంగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం, రాంపూర్ చెరువు కట్టతెగడంతో జాతీయ రహదారిపై వరద నీరు చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
భూపాలపల్లి జిల్లాలో వరద పరిస్థితులపైసమీక్షించడానికి హైదరాబాద్ నుండి బయలుదేరిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మార్గం మద్యలో రాంపూర్ వద్ద వరద ఉధృతిని పరిశీలించారు
స్థానికులు, వాహనదారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వరద తగ్గే వరకు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని స్వయంగా మంత్రి సూచించారు. రోడ్డు దాటే ప్రయత్నం చేయవద్దని, ప్రజలను కోరారు.
———————————————————–
గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాలతో చెరువులు అలుగు పోస్తున్నాయి
వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి
ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండండి
ప్రజలకు సహాయక చర్యలు చేపట్టండి
పెద్ద వంగర మండలం పోచంపల్లి ఘటనలో చనిపోయిన వారికి సంతాపం
ఏ సమస్య ఉన్నా, అధికారుల దృష్టికి, నా దృష్టికి తీసుకురండి
పాలకుర్తి నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్: గత 5 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తాను ప్రాతినిద్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ పరిస్థితులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా గ్రామాల పరిస్థితిని మంత్రి ఎర్రబెల్లి ప్రజా ప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… భారీ వర్షాలతో అన్ని గ్రామాల్లో చెరువులు అలుగు పోస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గ్రామంలో ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టాల్లో పాలు పంచుకోవాలని ఆదేశించారు. ఈ సమయంలోనే ప్రజలకు అండగా నిలబడాలని అన్నారు.
వరదలతో ఏ సమస్య ఉన్నా, అధికారుల దృష్టికి, తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఏ సమస్య వున్నప్పటికీ తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పెద్ద వంగర మండలం పోచంపల్లి ఘటన బాధాకరమని, అన్నదమ్ములు వరదలో కొట్టుకుపోయి చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసింది అన్నారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియచేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటానన్నారు.
———————————————-
నది పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీఎం కేసిఆర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితిపై కలెక్టర్ తో మంత్రి సమీక్ష
నిజామాబాద్: ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో… సీఎం కేసిఆర్ గారి ఆదేశాల మేరకు…జిల్లాలో నెలకొని ఉన్న తాజా పరిస్థితుల గురించి రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో సమీక్షించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
పరిస్థితి అదుపులోనే ఉందని, ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లడం వంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంత్రి దృష్టికి తెచ్చారు. అన్ని చోట్లా అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. కాగా, ప్రధాన జలాశయాలైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తున్నందున ఏ క్షణంలోనైనా వరద గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు.
జిల్లా కేంద్రం సమీపంలో నిజాంసాగర్ కెనాల్ పై నివాసాలు ఏర్పరచుకున్న సుమారు 400 కుటుంబాలను తక్షణమే సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు. ఫులాంగ్ వాగు ఇరుపక్కల నివసిస్తున్న వారిని కూడా ఇతర ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. నిజామాబాద్ నుండి ఆర్మూర్ వెళ్లే మార్గంలో మాణిక్ బండార్, ముబారక్ నగర్, గూపన్ పల్లి తదితర ప్రాంతాల వద్ద ప్రధాన రహదారిపై వర్షపు జలాలు నిలిచి ఉండకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. బోధన్ పట్టణంలోనూ నాలాను ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించి అవసరమైన చోట తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
రామడుగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిని సంతరించుకుంటున్నందున దిగువ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా ఆర్మూర్ ఏరియాలో శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ప్రవహించే ప్రదేశాల్లో ఎవరు కూడా చేపలు పట్టేందుకు వెళ్లకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నుండి ఎస్సారెస్పీలోకి భారీగా ఇన్ ఫ్లో వస్తున్నందున తల్వేద, మారంపల్లి, నూత్ పల్లి, బాద్గుణ తదితర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. కంట్రోల్ రూమ్ లలో ఎల్లవేళలా సిబ్బంది అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా అధికారులు, సిబ్బందిని సమాయత్తపర్చాలని మంత్రి సూచించారు.
నిజామాబాద్: సీఎం కేసిఆర్ గారి ఆదేశాల మేరకు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఇంట్లో నుండి ఎవరు బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు మంత్రి వేముల ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను కోరారు. పొంగి పొర్లుతున్న వాగులు,చెరువుల వద్దకు ప్రజలు,రైతులు దయచేసి రాకూడదని,జోరు వానలో ప్రయాణాలు లాంటివి పెట్టుకోవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
జోరు వానలో తడుస్తూ…క్ షేత్ర స్థాయి పరిస్థితులు పరిశీలిస్తూ..
భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నా… ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న మంత్రి వేముల
అత్యవసరం అయితే తప్పా ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మంత్రి
అధికారులను సమన్వయం చేస్తూ… వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు చక్కదిద్దుతున్న మంత్రి
ప్రజలు,రైతులతో మాట్లాడుతూ వారిలో ధైర్యం నింపుతున్న వేముల
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా,బాల్కొండ నియోజకవర్గంలోభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాలు అడ్డుకోలేం కానీ నష్టాన్ని నివారించగలం అంటూ జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయి అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ప్రాణనష్టం జరగకుండా పరిస్థితులు చక్కదిద్దుతున్నారు.
రెవెన్యూ,పోలీస్,ఎలక్ట్రిసిటీ,పంచాయితీ రాజ్,ఇరిగేషన్,ఆర్ అండ్ బి,హెల్త్ పలు ప్రభుత్వ శాఖలు అధికారులను,క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు,రైతులతో మాట్లాడుతూ మేమున్నాం అంటూ వారికి ధైర్యం చెప్తున్నారు. అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు,జాలర్లు ఎవరూ చేపల వేటకు వెళ్ళొద్దని కోరారు.
వేల్పూర్ మండల కేంద్రంలో అదేవిధంగా ఆర్మూర్ నుండి జగిత్యాల్ కు వెళ్లే జాతీయ రహదారి వద్ద,పడగల్ గ్రామానికి వెళ్లే దారిలో చెరువులు తెగి వరదలు రోడ్ల పై నుండి పారుతుండటంతో ప్రభావిత ప్రాంతాలను గురువారం వేకువ జామున్నే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ప్రజలను ఎవరిని బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను,ఇరిగేషన్ అధికారులందరు ఫీల్డ్ లోనే ఉండి పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులని ఆదేశించారు.
——————–
వివిధ పార్టీల నుండి మంత్రి వేముల సమక్షంలో బిఆర్ఎస్ లో చేరికలు
వేల్పూర్: సీఎం కేసిఆర్ జనరంజక పాలన,సంక్షేమ పథకాలు,బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అబివృద్దికి ఆకర్షితులై
కమ్మర్పల్లి మండలం కోనపూర్ నుండి వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు బుధవారం వేల్పూర్ లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
హసకొత్తూర్ గ్రామం నుండి గౌడ సంఘం,వడ్డెర కాలనీ సంఘం సభ్యులు,యాదవ సంఘం 1యాదవ సంఘము 2 సభ్యులు 50 మంది బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామ బిఎస్పీ పార్టీకి చెందిన యువకులు 10 మంది మంత్రి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్టీలో మహిళలు,యువకులు పెద్ద ఎత్తున చేరారు. చేరిన వారందరికీ మంత్రి గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇవాళ్టి నుంచి మీరందరూ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులనీ అన్ని వేళలా మీకు తోడుగా ఉంటానని మంత్రి వారికి భరోసా కల్పించారు. సీఎం కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా ఎదిగిందనీ గుర్తు చేశారు. కేసిఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ఆర్ధిక సహాయం అందిస్తూ వెన్ను దన్నుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
కేసిఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి వేముల స్పష్టం చేశారు. బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు ప్రజా,రైతు వ్యతిరేక పార్టీలని మంత్రి ఆరోపించారు. రెండు పార్టీలు రైతులను గోస పెట్టిన చరిత్రే అని, కేసిఆర్ వల్ల సంబురంగ ఉన్న రైతులను మళ్ళీ గోస పెట్టాలని చూస్తున్నారని అన్నారు. బీజేపీ మోటార్లకు మీటర్లు పెడుతుంటే..కాంగ్రెస్ 3గంటల కరెంట్ చాలు అంటుందని అన్నారు. ప్రజలు,రైతులు వారి మాటలపై ఆలోచన చేయాలని కోరారు. మాయ మాటలు చెప్తూ గందర గోళ పరిచే వారు వస్తారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరెన్ని రకాల స్వార్ద రాజకీయ ప్రయోజనాల కోసం బురదజల్లే ప్రయత్నం చేసినా..బాల్కొండ నియోజకవర్గ అభివృద్ది పరంపర ఆగే ప్రసక్తే లేదని మంత్రి మరోమారు తేల్చి చెప్పారు.
హైదరాబాద్: వారం రోజులుగా ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నాయని, దీంతో హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌తో కలిసి హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో వరద పరిస్థితిని మంత్రి కేటీఆర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వర్షకాలం ప్రారంభానికి ముందే నాలాల్లో పూడిక తీశామని చెప్పారు. చెరువుల్లోనూ తక్కువ నీటిమట్టం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. నగరంలో ఎస్సార్‌డీపీ చేపట్టకముందు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవని చెప్పారు.
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పురపాలక శాఖ మంత్రి @KTRBRS పర్యటించారు. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని మంత్రి పరిశీలించారు. అనంతరం చాదర్ ఘాట్ మూసీ నది లో-లెవెల్ వంతెన వద్ద వరదను పరిశీలించారు.#HyderabadRains pic.twitter.com/q4zaRbDnsy
— BRS Party (@BRSparty) July 27, 2023
విపత్కర పరిస్థితుల్లో చేతనైతే ప్రతిపక్షాలు సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వర్షాలను కూడా రాజకీయం చేయడం సరికాదన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో 14 బ్రిడ్జిలు మంజూరు చేశామన్నారు. అనంతరం ముసారంబాగ్ వద్ద మూసీనదిపై ఉన్న బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ పరిశీలించారు.
తెలంగాణలో రాగల మూడురోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గురువారం నాటికి బలహీనపడిందని, ప్రస్తుతం దక్షిణ ఒడిశా, పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ పరిసరాల్లో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్త వరకు కొనసాగుతుందని చెప్పారు.
రుతుపవన ద్రోణి బికానర్, కోట, రైజన్, దుర్గ్, దక్షిణ ఒడిశాతో పాటు పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రా అల్పపీడన ప్రాంతం మీదుగా తూర్పు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపారు. షీయర్ జోన్ వెంట సగటు సముద్రమట్టం 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుందని, ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ వైపు వంపుగా ఉందని పేర్కొన్నారు.
దీని ప్రభావంతో తెలంగాణలో అనేక ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ మేరకు వాతావరణశాఖ ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.