ప్రతి ప్రజా ప్రతినిధిని భాగస్వామ్యం చేయాలి
దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి
ఈ కార్యక్రమం గురించి ప్రతి గ్రామం, పట్టణంలో బోర్డులు పెట్టి ప్రచారం చేయాలి
సీఎం కేసీఆర్ గారు అత్యంత శ్రద్ద పెట్టి చేస్తున్న దీనిని కలిసికట్టుగా పని చేసి విజయవంతం చేయాలి
కంటి వెలుగు -2 హనుమకొండ, వరంగల్ జిల్లాల సన్నద్ధత సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హనుమకొండ: కంటి వెలుగు రెండో దశ కార్యక్రమాన్ని కలిసికట్టుగా టీమ్ వర్క్ గా పని చేసి విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు.
తెలంగాణలో అంధత్వ నివారణ లక్ష్యంగా చేపట్టిన కంటి వెలుగు – 2 కార్యక్రమంలో భాగంగా వరంగల్, హనుమకొండ జిల్లాల సన్నద్ధత సమావేశం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి అధ్యక్షతన నేడు హనుమకొండ కలెక్టరు కార్యాలయంలో ప్రారంభం అయ్యింది.
సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మాట్లాతూ…
“కంటి వెలుగు కార్యక్రమం గురించి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారితో ఇటీవలే హైదరాబాద్ లో వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. నేను కూడా అక్కడ పాల్గొన్నాను. సీఎం కేసీఆర్ గారు దీనిని పట్టుదలతో చేస్తున్నారు. మొదటి దశ కార్యక్రమం బాగా సక్సెస్ అయ్యింది. పెన్షన్లకు వచ్చిన రెస్పాన్స్ కంటే పెద్ద ఎత్తున దీనికి వస్తుంది. ఇది మంచి కార్యక్రమం. దేశంలో మన దగ్గర తప్ప ఎక్కడా చేయడం లేదు.
సీఎం కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ద తీసుకొని డాక్టర్లను నియమించి దీనిని చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయము చేసుకుని ప్రతి గ్రామంలో చేయాలి. కార్యక్రమం విజయవంతం చేయాలి. క్యాంప్ లను సక్సెస్ చేయాలి. గ్రామ, మండల సమావేశాలను ఎంపీపీలు, అధికారులు కలిసి ఏర్పాటు చేసి, ఏ రోజు ఎక్కడ కార్యక్రమం చేస్తారు, ఎవరు దేనికి బాధ్యత వహించాలి అని సమన్వయం చేసుకోవాలి. ఇది ప్రభుత్వ పథకం దీనిని విజయవంతం చేయాలి. గ్రామ సర్పంచ్, కార్యదర్శి, సఫాయి కార్మికులు అంతా క్యాంప్ జరిగే రోజు అక్కడే ఉండాలి. వసతులు అన్ని కల్పించాలి.
గ్రామ పంచాయతీకి వెయ్యి రూపాయలు ఇస్తున్నాం. సర్పంచ్లు, ఎంపీటీసీలు దీనిని తమదిగా భావించి విజయవంతం చేయాలి. ఈ వంద రోజుల కార్యక్రమం గురించి ప్రతి గ్రామం, పట్టణం లో బోర్డులు పెట్టీ బాగా ప్రచారం చేయాలి. ప్రతి ప్రజా ప్రతినిధిని ఇందులో భాగస్వామ్యం చేయాలి. గ్రామాల్లో అందరినీ క్యాంప్ లకు గ్రామ నాయకులు తీసుకురావాలి. మీకు బుక్ లెట్ ఇస్తున్నాం..ఇందులో ఈ కార్యక్రమం పూర్తి వివరాలు ఉంటాయి. శనివారం, ఆదివారం తప్ప వారంలో అన్ని రోజుల్లో క్యాంప్స్ ఉంటాయి. ఎక్కడి వారు అక్కడే బస చేయాలి. టీమ్ వర్క్ గా చేయాలి. పని చేసే వారికి 1500 రూపాయలు ఇస్తున్నారు. ఇది ఫెయిల్ అయితే ప్రజా ప్రతినిధులు, అధికారులు ఫెయిల్ అయినట్లే. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమంగా పని చేయాలి.
ముందే భోజనాలు, మౌలిక సదుపాయాలు, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఇందుకోసం ముందే క్యాంప్స్ జరిగే ప్రాంతానికి వెళ్లి పర్యవేక్షించాలి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సమావేశాలు పెట్టుకోవాలి. అన్నీ గ్రామాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. జిల్లాలకు ఇప్పటికే రీడింగ్ గ్లాసెస్ వచ్చాయి. ఇవి చాలా బాగున్నాయి. మిగిలిన వారికి టెస్ట్స్ చేసిన తరవాత 15 రోజుల్లో అద్దాలు వస్తాయి. మందులు ఇస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.”
ఈ సమావేశానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, హనుమకొండ జిల్లా జెడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్, వరంగల్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ , ఎమ్మెల్సి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, వొడితెల సతీష్, అరూరి రమేష్, రుణ విమోచనా కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, నర్సంపేట జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఎన్.గోపి, జిల్లాల అధికారులు, మున్సిపల్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.