Violence In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో చల్లారని అల్లర్లు, ఉద్రిక్తతలు, 144 సెక్షన్ అమలు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో రాజుకున్న కక్షల జ్వాల ఎన్నికలు ముగిసినా చల్లారడం లేదు. ముఖ్యంగా పౌరుషాల పోరు గడ్డగా పేరుగాంచిన పల్నాడు జిల్లా గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉంది. అయుతే తాజాగా జరిగిన ఎన్నికల నేపథ్యంలో మరచిపోయిన రక్తం వాసన మళ్ళీ గుర్తుకొచ్చింది. ఈ క్రమంలో దాడులు, ప్రతిదాడులతో పల్నాడులో హింసాత్మకంగా మారింది.

కారంపూడి, పిడుగురాళ్ల, గురజాల, సత్తెనపల్లి కురుక్షేత్ర రణరంగాన్ని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అధికారులు 144 సెక్షన్ అమలు చేశారు. ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గుంపులుగా బయట తిరిగినా రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడినా అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కాగా టీడీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఫిర్యాదు మేరకు ఈసీ పారామిలటరీ బలగాలను పల్నాడుకు జిల్లాకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. దీనితో డీజీపీ పారామిలటరీ బలగాలను పల్నాడుకు జిల్లాకు పంపారు. అలానే పట్టణంతోపాటు, గ్రామాల్లో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, దాదాపు వెయ్యిమంది అదనపు బలగాలను శాంతిబధ్రతల సంరక్షణకు పల్నాడు జిల్లాకు తరలించారు.

పల్నాడు జిల్లా కొత్తగణేషునిపాడులో మంగళవారం కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి. కొత్తగణేషునిపాడులో సోమవారం సాయంత్రం టీడీపీ, వైసీపీ వర్గాలు రెండు గ్రూపులుగా విడిపోయి నాటుబాంబులతో దాడి చేసుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి వరకూ ఈ గొడవలు కొనసాగాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టినప్పటికీ.. సోమవారం రాత్రంతా కొత్తగణేషుడిపాడులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో వైసీపీ వర్గానికి చెందిన కొంతమంది రాత్రంతా పోలీసుల భద్రత మధ్యన గుడిలోనే ఉన్నట్లు తెలిసింది.

మరోవైపు మంగళవారం ఉదయం వైసీపీ నేతలు కాసు బ్రహ్మానందరెడ్డి, అనిల్ కుమార్ ఘటనాస్థలికి చేరుకోవటంతో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. ప్రత్యర్థి వర్గం వైసీపీ నేతల కాన్వాయిమీద కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి మరోసారి చేయిదాటడంతో కేంద్ర బలగాలు జోక్యం చేసుకున్నాయి. గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం వైసీపీ నేతలను అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పల్నాడులో మరికొన్ని రోజులు ఆంక్షలు కొనసాగించాలని పోలీసులు భావిస్తున్నారు.

మరోవైపు తిరుపతి జిల్లా చంద్రగిరిలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కారు మీద వైసీపీ వర్గాలు దాడి చేశాయి. పద్మావతి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించేందుకు పులివర్తి నాని వెళ్లిన సమయంలో ఆయన కారుమీద దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడిచేసి.. కారును ద్వంసం చేశారు. దాడి నేపథ్యంలో టీడీపీ మహిళా నేతలు యూనివర్సిటీ ఎదుట ఉన్న రహదారిపై బైఠాయించి.. నిరసన వ్యక్తం చేశారు. దాడిలో పులివర్తి నాని సెక్యూరిటీకి గాయాలయ్యాయి.

ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ శివశంకర్‌ పోలీసు శాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. నరసరావుపేట లోక్‌సభతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి తిరిగి ఆదేశాలు జారీచేసే వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ప్రకటించారు.

జిల్లా వ్యాప్తంగా ముగ్గురికి మించి ఎక్కువ మంది గుమికూడరాదని, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించకూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు. పల్నాడులో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఈసీ జోక్యం చేసుకుంది. అనంపురం, పల్నాడు జిల్లాల్లో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా గొడవలు కొనసాగాయి.

టీడీపీ, వైసీపీ పక్షాల మధ్య జరిగిన అల్లర్లతో పలు ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయి. దీంతో పల్నాడు జిల్లాలో సెక్షన్ 144 విధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు పల్నాడు జిల్లాకు అదనపు బలగాలు తరలించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

పల్నాడు జిల్లాలోని మాచర్లతో పాటు పలు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులపై అధికారులు ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. దీంతో జిల్లాలో నిషేదాజ్ఞలు అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వైసీపీతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల అనుచరులు టీడీపీ నేతల్ని టార్గెట్‌గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ అధ్యక్షుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

పల్నాడు గొడవలపై డీజీపీతో పాటు గవర్నర్ లేఖలు రాశారు. పల్నాడులో శాంతి భద్రతల పరిస్థితిపై గవర్నర్కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. మాచర్లలో మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారంతో అలెర్టైన పోలీసులు నిషేదాజ్ఞలు విధించారు.

ఈసీ ఆదేశాలతో పారామిలటరీ బలగాలను పల్నాడుకు జిల్లాకు డీజీపీ పంపారు. మాచర్ల పట్టణంతో పాటు, గ్రామాల్లో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యిమంది అదనపు బలగాలను పల్నాడు జిల్లాకు తరలించారు. టీడీపీ సానుభూతిపరుల ఇళ్లు, వ్యాపార దుకాణాలపై దాడులు చేశారని ఆ పార్టీ ఆరోపిస్తోంది.

అటు తిరుపతిలో కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. మంగళవారం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. పులివర్తి నాని వాహనాలపై భారీ సుత్తులు, గొడ్డళ్లతో దాడులకు పాల్పడ్డారు. నిందితులను అరెస్ట్ చేయని పోలీసులు బాధితులపైనే కేసుపెట్టారిన ఆరోపిస్తూ పులివర్తి నాని భార్య ఆందోళనకు దిగారు. తిరుచానూరు పీఎస్ ముందు పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ధర్నాకు దిగారు.

అనంతపురంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అర్థరాత్రి జేసీ నివాసంలో పోలీసులు తనిఖీ చేపట్టారు. జేసీ అనుచరులపై దాడి చేసిన అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దాడులను జేసీ దివాకర్ రెడ్డి ఖండించారు. తమ ఇంట్లో ఇద్దరు పేషెంట్లు ఉన్నారని, ఇద్దరూ మంచంపై లేవలేని స్థితిలో ఉన్నారని వారికి మందులు ఇచ్చేందుకు కూడా ఎవ్వరు లేరన్నారు. పని మనుషులను కూడా పోలీసులు తీసుకెళ్లిపోయారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X