“డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలి, ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడూ MLA అవ్వొచ్చు”

హైదరాబాద్: డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా గెలవచ్చని, అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని చెప్పారు సీఎం. ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని తెలిపారు. శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ అలుమ్నీ మీట్, గ్రాడ్యుయేషన్ డేలో సీఎం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కఠోర దీక్షతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిని అయ్యానని, ఎంతో మంది పోటీలో ఉన్నా కూడా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

వివేక్, వినోద్ రామాయణంలో లవకుశుల లాంటివారని కొనియాడారు. ఎంత సంపాదించామనేది కాదు సమాజానికి ఎంత పంచామనేది సామాజిక బాధ్యత అనేది కాకా విధానమన్నారు. అటువంటి కాకా వెంకటస్వామి వర్థంతి రోజు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం గొప్ప కార్యక్రమమని అన్నారు. గత 50 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చి దిద్దిన ఘనత కాకా సొంతమని వ్యాఖ్యానించారు. దేశ నిర్మాణంలో ఆయన వారి సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యనందిస్తున్న ఘనత కాకా కుటుంబానిదన్నారు.

తెలంగాణ ఉద్యమంలో కాకా ఫ్యామిలీ ముందుందన్న సీఎం రేవంత్ ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీస్ కూడా కాకా పేరునే ఉందని తెలిపారు. దేశ నిర్మాణంలో కూడా కాకా పాత్ర ఉందన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎలానో తెలంగాణకు కాకా కుటుంబం అలా అని చెప్పుకొచ్చారు. బీఆర్ అంబేద్కర్ కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం నుంచి చేయూతనందించేందుకు సిద్దమని రేవంత్ హామీ ఇచ్చారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు తాము అండగా ఉంటామన్నారు.

రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధిపై కృషి చేస్తామని తెలిపారు. కళాశాల సమయంలో భవిష్యత్ కు బంగారు పునాదులు వేసుకోవాలని సూచించారు. విద్యార్థి దశలోనే వీలైనంత ఎంజాయ్ చేస్తూనే భవిష్యత్ వైపునకు సరైన దిశలో అడుగులు వేయాలని చెప్పారు. ముఖ్యంగా డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లకు బానిస కాకూడదని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తమ ప్రభుత్వానిది అని అందుకే విద్యార్థులంతా మంచిగా చదువుకుని సర్కార్ కొలువు సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంతకుముందు కాలేజీలో కాకా విగ్రహాన్ని సీఎం రేవంత్ అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, తదితరులు పాల్గొన్నారు

ఒక్క పైసా డొనేషన్ తీసుకోకుండా ఫ్రీ ఎడ్యుకేషన్

డొనేషన్ లేకుండా పేద విద్యార్థులకు  విద్యను అందిస్తున్నామని బీఆర్ అంబేద్కర్ లా కాలేజ్ కరస్పాండెంట్ సరోజా వివేక్  అన్నారు. కాలేజీ గ్రాడ్యుయేషన్ లో పాల్గొన్న ఆమె గ్రాడ్యుయేషన్ డేకు సీఎం రేవంత్ రెడ్డి రావడం సంతోషంగా ఉందన్నారు. పేద విద్యార్థుల కోసం 1997లో  కాకా విద్యాసంస్థలు ప్రారంభించారని చెప్పారు. యూనియన్ మినిస్టర్ అయినా  కల మర్చిపోకుండా తన రోల్ మోడల్ అయినా అంబేద్కర్  పేరుతో కాకా విద్యా సంస్థలు స్థాపించారని చెప్పారు.

అంబేద్కర్ పేరు మీద విద్యార్థులకు సేవ చేస్తున్నామని చెప్పారు సరోజా వివేక్. అంబేద్కర్ విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నారన్నారు. కాలేజీలో ఒక్క పైసా డొనేషన్ తీసుకోవడం లేదన్నారు.  80 శాతం మార్కులు వచ్చిన  విద్యార్థులకు ఫ్రీ ఎడ్యూకేషన్ ఇస్తున్నామన్నారు. 

టెన్త్ తరువాత డీస్ కంటిన్యూ అవ్వకుండా జూనియర్ కాలేజీలో అడ్మిషన్ ఇస్తున్నామని చెప్పారు సరోజా వివేక్. దేశంలో అంబేద్కర్ లా కాలేజ్20వ స్థానంలో ఉందన్నారు. ఇటీవల సెలెక్ట్ అయినా జూనియర్ జడ్జెస్ లో లా కాలేజ్ స్టూడెంట్స్ నలుగురు ఉన్నారని తెలిపారు. 

మార్నింగ్ వాకింగ్కు వచ్చి కాలేజ్ పెట్టాలని డిసైడ్ అయ్యిండు

పార్క్ లో మార్నింగ్ వాకింగ్ కు వచ్చినప్పుడు..పేదల కోసం మంచి కాలేజి పెట్టాలనుకుని కాకా కాలేజీ స్థాపించారని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాక ఒక్క డ్రీమ్ ఉన్న నాయకుడన్నారు. రాష్ట్రపతి కావాలన్న కాకా  ఒక్క కోరిక నెరవేరలేదన్నారు. బాగ్ లింగంపల్లిలోని  బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ గ్రాడ్యుయేషన్ డేలో మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. కాకా స్పూర్తితోనే విద్యాసంస్థలను తీర్చిదిద్దామన్నారు.  కాకా చూపిన దారిలోనే నడుస్తున్నామని కాకా సూచనలతో పేదలకు మెరుగైన విద్య అందిస్తున్నామన్నారు.  

1980లో పేదలకు రేషన్ విధానం తీసుకొచ్చింది కాకానే అని చెప్పారు వివేక్ వెంకటస్వామి. బీదలకు రూపాయికే అన్నపూర్ణ క్యాంటీన్ తీసుకొచ్చారని అన్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పెన్షన్  తీసుకొచ్చారని… పేద ప్రజలకు  ఇళ్ల జాగలు ఇప్పించారని చెప్పారు. 

కాకాకు రాష్ట్రపతి కావాలనే కోరిక ఉండే కానీ ఆంధ్ర ప్రదేశ్ నాయకులు అడ్డుపడ్డారని చెప్పారు వివేక్ వెంకటస్వామి. కాకా స్ఫూర్తితో ఒత్తిళ్లు ఉన్నా తాను సేవ చేస్తున్నానని చెప్పారు. యువత కలలు కనాలి. సాధించే వరకు  శ్రమించాలని సూచించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X