మా నౌకరీలు మాగ్గావాలె : మహా ధర్నలో ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు, KTR భర్తరఫ్ కు డిమాండ్

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన ‘‘నిరుద్యోగ మహాధర్నా’’కు హాజరైన పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, విజయశాంతి, జి. వివేక్ వెంకటస్వామి, ఇంద్రసేనారెడ్డి, తమిళనాడు సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ మంత్రులు చంద్రశేఖర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు….

డీఎస్సీ-2008 బాధితుల సంఘం నాయకురాలు విజయలక్ష్మీ…

• బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ మహాధర్నా జన సంద్రాన్ని తలపిస్తోంది.

• తెలంగాణ తల్లి రెండు కళ్లల్లో కన్నీళ్లే వస్తున్నాయి. రైతులు, విద్యార్థుల ఘోషతో ఏడుస్తోంది.

• తెలంగాణ తల్లి కన్నీళ్లు తుడ్చేందుకు ఉద్యమిస్తున్న బండి సంజయ్ కు మా సంపూర్ణ మద్దతిస్తాం.

• డీఎస్సీ-2008 బాధితులందరికీ ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 9 ఏళ్లయినా పట్టించుకోని దుర్మార్గపు ప్రభుత్వం కేసీఆర్ దే.

• హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా పట్టించుకోవడం లేదు

• 14 ఏళ్లుగా పోరాడుతున్న మా ఉసురు కేసీఆర్ సర్కార్ కు తగులుతుంది.

• ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకు మేం సిద్ధం…

బీజేపీ ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ రెడ్డి…

• రాష్ట్రంలో ఎక్కడ చూసినా లిక్కర్ క్వీన్… లీకేజీ కింగ్ గురించే చర్చ జరుగుతోంది.

• ఉస్మానియా విద్యార్థుల ఊపిరిలూదితే… కాకతీయ కదం తొక్కితే.. పాలమూరు పదం పాడితే వచ్చిన

• నోటిఫికేషన్లు వేస్తే ఉద్యోగాలొస్తాయని భావిస్తే… లీకు వీరుడి తీరుతో నిరుద్యోగులు నష్టపోతున్నారు.

• లిక్కర్ క్వీన్ స్కాంను అడ్డుకోవడానికి… సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న వారంతా ఒక్కటై మోదీపై విష ప్రచారం చేస్తున్నారు.

• లీకు వీరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు… కేసీఆర్ మెడలు వంచుతాం… దోషులను శిక్ష విధించే వరకు పోరాడతాం…
ఉస్మానియా విద్యార్థి సంఘాల జేఏసీ లింగస్వామి…

• ఆంధ్రా పాలకులను మించి దోపిడీ చేస్తున్న కేసీఆర్

• మా భవిష్యత్ కోసం పోరాడుతున్న బండి సంజయ్ పోరాటానికి సంపూర్ణ మద్దతిస్తున్నాం.

• పేపర్ లీకేజీపై కేసీఆర్ మౌనాన్ని ప్రశ్నించాల్సిందే….

• ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు టెంట్ వేసుకుని ధర్నాలు, ఆందోళన చేయడానికి కూడా వీల్లేకుండా నిషేధిస్తారా? పోలీసులను పెట్టి హాస్టళ్లలోకి చొరబడి అరెస్ట్ చేసి జైళ్లో పెడుతున్నారు.

• ప్రతిపక్ష నేతల్లారా… ఉస్మానియా వర్శిటీకి రండి…

• కేసీఆర్ దమ్ముంటే ఓయూకు రా… మా దమ్మేందో చూపిస్తాం..

• పంట నష్టపోతే ఎకరాకు రూ.10 వేలు ఇస్తానన్న కేసీఆర్ పేపర్ లీకేజీతో నష్టపోయిన 3 లక్షల మంది నిరుద్యోగులకు ఎందుకు పరిహారం ఇవ్వడం లేదు?

• కేసీఆర్ సర్కార్ పై మరో తిరుగుబాటు జరగాల్సిందే… పార్టీలు, సంఘాలకు అతీతంగా ఏకమై కేసీఆర్ పాలనను బొందపెట్టాల్సిందే…

ఉస్మానియా, కాకతీయ విద్యార్థి జేఏసీ నాయకులు అంజిబాబు, పుల్లారావు యాదవ్, కుమారి సాహితీ…..

• లీకేజీకి కారకుడైన కేసీఆర్ సర్కార్ ను తరిమికొట్టాల్సిందే…

• పీహెచ్ డీ, పీజీలు చేసినా ఉద్యోగాలు రాలేదు… అడిగితే గొర్రెలిస్తున్నాడు.. ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకుంది?

• తెలంగాణ వస్తే చావులుండవనుకున్నం… కానీ నిరుద్యోగులే ఎక్కువ చనిపోతున్నారు. తిండిలేక 5 రూపాయల భోజనం చేస్తున్నారు. చదువు కోసం రక్తాన్ని అమ్ముకుంటున్నరు.

• మా కోసం దీక్ష చేస్తున్న బండి సంజయ్ కు సంపూర్ణ సంఘీభావం.

• ఉద్యోగాలు సంపాదించడం పరీక్షల రద్దు అనేంత చిన్న పదం కాదు….

• కంచంలో పిడికెడు కూడు కోసం కలలు కంటూ అయ్య అవ్వల పైసలతో చదువుకుంటే ఓ లంగా గాడు చేసిన లీకేజీతో నిరుద్యోగులంతా నష్టపోయారు.

• నాకు సంబంధం లేదని చెబుతున్న కేటీఆర్ కు దేనితో సంబంధం ఉంది. సినిమా యాక్టర్ల ఫంక్షన్లకు అటెండ్ కావడానికి నీకు సంబంధం ఉంటది…. వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన వాళ్ల డొక్కలో తంతే సంబంధం లేదా? లీకేజీకి కారణమైన టీఎస్పీఎస్సీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నీ శాఖ వాళ్లు కాదా?

• నిరుద్యోగులను అరెస్టులు, కేసులతో బంధించినంత మాత్రాన మా ఉద్యమాలు ఆగవు… నిప్పుల కొలిమిలా లేస్తాం… పేపర్ లీకేజీకి కారణమైన వాళ్లను బొందపెట్టేదాకా పోరాడతాం….

బండి సంజయ్ చేపట్టిన ‘‘నిరుద్యోగ మహాధర్నా’’కు కదం తొక్కిన నిరుద్యోగులు, వివిధ సంఘాల నేతలు..

మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి……

• తెలంగాణ వచ్చాక కూడా నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది?

• తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు…కేసీఆర్ నమ్మి అధికారం అప్పగిస్తే… తెలంగాణ రాజ్యం… నేను రాజు అన అనుకుంటే ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నాడు..

• మిగులు రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో దోచుకుని అప్పుల పాల్జేయడమే కాకుండా నిరుద్యోగుల పొట్ట కొట్టిన కేసీఆర్..

• ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో పేపర్ లీకేజీతో నిరుద్యోగులు బాధపడుతుంటే బిడ్డను కాపాడుకునేందుకు ఢిల్లీకి పోతున్న కేసీఆర్ కేబినెట్ కు సిగ్గు లేదు..

• కేసీఆర్ భయస్తుడు… ప్రజలు అడ్డుకుని నిలదీస్తారని సెక్యూరిటీని పెట్టుకున్నడు.

• మునుగోడులో నైతిక విజయం బీజేపీదే… అమిత్ షా అడుగుపెడితే భయంతో వణికిపోయి పైసలు వెదజల్లి అక్రమంగా గెలిచిన కేసీఆర్…

• తెలంగాణ ఉద్యమంలో లేని కోన్ కిస్కా రేవంత్ రెడ్డి అప్పులపాలైన తెలంగాణను ఎట్లా కాపాడతాడు.. రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్నడు.

• అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ను బీజేపీ కార్యకర్తలు బుద్ది చెప్పడం ఖాయం…మనమంతా యుద్దానికి సిద్ధం కావాలి.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ…

• కేసీఆర్, కేటీఆర్ ఇదిగో నోటిఫికేషన్లు అంటూ 8 ఏళ్లుగా ఊరించారు. వారి మాటలను నమ్మి కోచింగ్ తీసుకున్న నిరుద్యోగులంతా నష్టసోయారు.

• పేపర్ లీకేజీ కల్వకుంట్ల కుటుంబ కోణం… అయినా తమ ప్రమేయం లేదని చెప్పడం విడ్డూరం.

• గొప్పతనాన్ని ఘనంగా చెప్పుకునే కల్వకుంట్ల కుటుంబం… తప్పులున్నా లేదని దబాయించి చెబుతున్నరు.

• తప్పు చేసినవాళ్లను వదిలి… పోరాడుతున్న బండి సంజయ్ కు సిట్ నోటీసులిస్తారా?

• సిట్ అంటే కేసీఆర్ ద్రుష్టిలో సిట్ అంటే సిట్.. హుట్ అంటే హుట్…

• నిరుద్యోగుల భవిష్యత్ ను నాశనం చేసే కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హత లేదు

• కేసీఆర్ సర్కార్ ను తరిమికొట్టేదాకా అందరం కలిసి ఐక్యంగా పోరాడుదాం….

• నీళ్లు-నిధులు-నియామకాల పేరుతో తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఉసురు కేసీఆర్ పోసుకుంటున్నడు..

• లిక్కర్ దందా అడ్డంగా దొరికిన కవితను ఈడీ విచారణ చేస్తే కక్ష సాధింపా? అవి బీజేపీ సంస్థలా?

• మరి ఇక్కడున్న సిట్, సీఐడీ సంస్థలేమిటి?

• నిరుద్యోగ సమస్యలపై పోరాడితున్న వాళ్లను జీర్ణించుకోలేక, ప్రశ్నిస్తున్న మీడియా సంస్థలను, జర్నలిస్టులపై దాడులు చేస్తూ జైళ్లకు పంపడం కక్ష సాధింపు చర్యలు కావా?

• ప్రజల పక్షాన గళం విప్పే వాళ్లపై కక్ష సాధింపు చర్యలు.. అరెస్టులా?

• కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందాపై కేసీఆర్ నోరెందుకు విప్పలే? తెలంగాణ ప్రభుత్వాన్ని మొత్తం ఢిల్లీకి ఎందుకు తీసుకుపోయినట్లు?

• పేపర్ లీకేజీపై అడ్డగోలుగా మాట్లాడుతూ విచారణను తప్పుదోవ పట్టిస్తున్న కేసీఆర్ కు, కేటీఆర్ కు, హరీష్ రావులకు నోటీసులివ్వాలే తప్ప బండి సంజయ్ కు నోటీసులిస్తారా?

• కేసీఆర్… మీ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయ్…. ప్రజా తీర్పును ఎదుర్కోవడానికి సిద్ధం కండి…

• నిరుద్యోగుల పక్షాన ధర్నా చేసే వాళ్లపై కేసులు పెడతారా? అరెస్ట్ చేస్తారా? కక్ష సాధింపులు బీఆర్ఎస్ కు అలవాటుగా మారింది.

• డీఎస్సీ నియామకాలు ఏళ్ల తరబడి ఎందుకు పూర్తి చేయలేదు? ఎందుకు కొత్త నియామకాలు చేపట్టడం లేదు?

• టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కేటీఆరే బాధ్యత వహించాలి. 6 పరీక్షలనే కాకుండా అంతకుముందు జరిగిన పరీక్షలపైనా అనుమానాలున్నాయ్..

• నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష ఇవ్వాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. బాధ్యుడైన కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలి. కేసీఆర్ సర్కార్ గద్దె దించేదాకా పోరాడదాం…

-బీజేపీ చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాకు విచ్చేసి సంఘీభావం తెలిపిన ఆర్టీసీ మాజీ ఛైర్మన్, కాంగ్రెస్ నేత గోనె ప్రకాశ్ రావు
-కేసీఆర్ కొడుకు నౌకరీని ఊడగొడతాం… నిరుద్యోగులకు నౌకర్లు ఇచ్చేదాకా పోరాడదాం

-తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు చేయించడంలేదు?

-పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష ఇవ్వాల్సిందే

-కేసీఆర్ సర్కార్ మెడలొంచేందుకే నిరుద్యోగ మహాధర్నా

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటన
-నిరుద్యోగ మహాధర్నాకు పోటెత్తిన జనం

-బండి సంజయ్ మహాధర్నాకు హాజరై సంఘీభావం ప్రకటిస్తున్న నిరుద్యోగులు, ప్రజా, యువజన సంఘాల నాయకులు

-బీజేపీ మహాధర్నాకు విచ్చేస్తున్న ఓయూ విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు

-సంజయ్ ధర్నాకు సంఘీభావం పలికిన డీఎస్సీ అభ్యర్థులు.

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి…

• ఐటీ మంత్రి వైఫల్యంవల్లే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ… మీ టెక్నాలజీ ఏమైంది?

• పేపర్ లీకేజీలో కేటీఆర్ పాత్ర ఉంది.. .ఆయన పీఏ పాత్ర ఉంది…

• గతంలో ఎన్నడూ టీఎస్పీఎస్సీ నుండి పేపర్ లీకేజీ అయిన దాఖల్లాలేవ్…

• టీఎస్పీఎస్సీ అటానమస్ సంస్థ కాబట్టి ప్రభుత్వానికి బాద్యత లేదనడం అర్ధరహితం…

• లిక్కర్, వైన్ షాపుల నోటిఫికేషన్లు తప్ప తెలంగాణలో ఏ ఒక్క నోటిఫికేషన్లు సక్రమంగా అమలు కావడం లేదు.

• కాళోజీని స్పూర్తిగా తీసుకునే కేసీఆర్…. ఈ పేపర్ లీకేజీలో బొందపెట్టాల్సింది ఎవరిని?

• నిరుద్యోగులంతా మరో మిలియన్ మార్చ్ కోసం చూస్తున్నారు…కేసీఆర్ తీరుతో మరో ఉద్యమం

• కేసీఆర్ మరో కొత్త నిజాం… ఆయన ఆఫీస్ నుండే స్కాంలు జరుగుతున్నాయి…

• కొత్త నిజాంను నిలదీసే పార్టీ బీజేపీ మాత్రమే… సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ జరిపించేదాకా ఉద్యమిస్తాం…

• తెలంగాణ ప్రజలకు సిట్ పై నమ్మకం లేదంటే… కేసీఆర్ పైనే ప్రజలపై నమ్మకం లేదు…

• కేసీఆర్ రాజీనామా చేయాలి… కేటీఆర్ రాజీనామా చేసేదాకా పోరాడతాం…

‘‘కేసీఆర్ కొడుకు నౌకరీని ఊడగొడతాం… నిరుద్యోగులకు నౌకరీలు వచ్చేదాకా పోరాడదాం… టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేదాకా ఉద్యమిస్తాం. అందుకోసమే మా నౌకరీలు మాగ్గావాలే నినాదంతో ఈ నిరుద్యోగ మహాధర్నా చేపట్టినం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. ఈరోజు మా నౌకరీలు మాగ్గావాలే నినాదంతో ఇందిరాపార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిరుద్యోగు మహాధర్నా పేరిట దీక్షకు పూనుకున్నారు.

ఈ మహాధర్నాకు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, విజయశాంతి, జి.వివేక్ వెంకటస్వామి, ఇంద్రసేనారెడ్డి, తమిళనాడు సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ మంత్రులు చంద్రశేఖర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్ జి. మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు సహా వివిధ జిల్లాల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. బీజేపీ చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాకు ఆర్టీసీ మాజీ ఛైర్మన్, కాంగ్రెస్ నేత గోనె ప్రకాశ్ రావు విచ్చేసి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా మహాధర్నాను ప్రారంభిస్తూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…

• నిరుద్యోగుల భవిష్యత్ ను నాశనం చేసిన కేసీఆర్ సర్కార్ మెడలు వంచేదాకా బీజేపీ పోరు ఆగదు…

• కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసే దాకా మెడలు పట్టి గెంటివేసేదాకా, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేదాకా బీజేపీ ఉద్యమం ఆగదు…

• పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులందరికీ రూ.లక్ష చొప్పున ఇచ్చేదాకా ఉద్యమం చేస్తాం.

• నేను లేని సమయంలో సిట్ పోలీసులు మొన్న నోటీసులు అంటించి పోయారు. ఈరోజు వస్తానంటే నేనే ఆహ్వానించిన. నోటీసులు తీసుకున్నా… లీగల్ పరంగా స్పందిస్తాం. దేశం కోసం, ధర్మం కోసం కష్టపడి పనిచేసే పార్టీ బీజేపీ. తెలంగాణను కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.

• నువ్వు తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడంలో అభ్యంతరమేముంది? దొంగలను పట్టుకోవాలని మేం కోరుతుంటే ప్రతిపక్షాలకు నోటీసులిచ్చే స్థాయికి ఈ ప్రభుత్వం వచ్చింది. ఇద్దరివల్లే లీకేజీ అని కేసీఆర్ కొడుకు చెప్పిండు.. మరి ఇప్పటికే 13 మందిని ఎట్లా అరెస్ట్ చేసినవ్?

• నాపై ఆరోపణలు చేసిన కేటీఆర్ కు ఎందుకు నోటీసులివ్వలేదు? నీకో న్యాయం? సామాన్య ప్రజలకు ఒక న్యాయమా?

• టీఎస్పీఎస్సీ లీకేజీకి బాధ్యత వహించి కేసీఆర్ కొడుకు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందే… లేనిపక్షంలో బర్తరఫ్ చేయాల్సిందే.. ఇతర మంత్రులైతే లేనిపోని నిందలు మోపి బయటకు పంపుతున్న కేసీఆర్ కొడుకు లుచ్చా పనులు చేస్తున్నా ఎందుకు కాపాడుతున్నారు?

• కేసీఆర్ నయా నిజాం, కుటుంబ, అవినీతి పాలనకు వ్యతిరేకంగా బీజేపీ ఎప్పుడో యుద్దాన్ని ప్రకటించింది. ఈ ప్రభుత్వానికి బీజేపీ అంటే భయమేందో చూపిస్తాం…

• తక్షణమే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయాలి. నిరుద్యోగులకు లక్ష చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే..

• నిరుద్యోగుల పక్షాన పోరాడినందు బీజేవైఎంకు చెందిన 11 మంది నాయకులను అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా జైలుకు పంపారు. వందలాది మంది నాయకులపై కేసులు పెట్టారు. ఇబ్బందులు పెడుతున్నరు. మాకు జైళ్లు, కేసులు కొత్తకాదు… ధర్మం కోసం, దేశం కోసం, నిరుద్యోగుల కోసం దేనికైనా కొట్లాడతాం….
బీజేపీ నిర్వహిస్తున్న నిరుద్యోగ మహాధర్నా సందర్భంగా బీజేపీ నేతలు చేసిన ప్రసంగాల్లోని ముఖ్యాంశాలు…

తమిళనాడు రాష్ట్ర సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి

• ప్రజా ప్రతినిధులకు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన మరుక్షణమే ఎంపీ, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఆనాడు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఈరోజు సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ అనర్హతను వ్యతిరేకించడం సిగ్గు చేటు.

• ఈరోజు కాశ్మీర్ లో భారత జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్నారంటే అది నరేంద్రమోదీ ఘనత. నిజమైన ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించిన బీజేపీకి నా సెల్యూట్ చేస్తున్న.

• ప్రజాస్వామ్యబద్దంగా నిరుద్యోగుల పక్షాన ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా… మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది?

• నిరుద్యోగులందరికీ బీజేపీ అండగా ఉంటుంది.. వారికి ఉద్యోగాలిచ్చేదాకా పోరాడతాం..
• బీజేపీ నిరుద్యోగ మహాధర్నాకు హాజరై సంఘీభావం తెలిపిన కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు
• బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాకు విచ్చేస్తున్న ఏబీవీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు….
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి …..

• కేసీఆర్ సర్కార్ పాలనలో లీకేజీ పేరుతో వ్యాపారం జరుగుతోంది. లీకేజీ బయటపడేసరికి మాకు సంబంధం లేదని తండ్రీకొడుకులు తప్పించుకుంటున్నారు.

• ఒక సాధారణ ఉద్యోగులు ఛైర్మన్ చాంబర్ కు వెళ్లి లీకేజీ చేయగలరా? అసాధ్యం. కచ్చితంగా లీకేజీ లో తండ్రీకొడుకుల పాత్ర ఉంది.

• సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్… ఇల్లీగల్ గా, క్రిమినల్ పనులు సంతోషంతో చేయడమే కేసీఆర్ పని. ఆయనకు కావాల్సింది లాభమే. ..

• ఇయాళ లీకేజీతో పార్టీకి చెడ్డపేరు రావడంతో నిరుద్యోగుల ఫీజులు మాఫీ చేస్తాం… ఫ్రీ బువ్వ పెడతామంటున్నారు.. మీకేమైనా దిమాక్ ఉందా? 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును దెబ్బకొట్టిన మీరు.. నిరుద్యోగులకు ఫ్రీగా బువ్వ పెడతామంటారా?

• గతంలో గ్లోబరీనా సంస్థ నిర్వాకంవల్ల చనిపోయిన పిల్లల ప్రాణాలు తీసుకొస్తారా?

• కేసీఆర్ పాలనలో విద్య సర్వనాశనమైంది. 30 వేల స్కూళ్లు మూతపడ్డాయి.

• కేసీఆర్ కు విద్యలో, వైద్యంలో, భూముల్లో, లిక్కర్ లో కమీషన్లు కావాలి…. డబ్బు కేసీఆర్ కు పెద్ద జబ్బు… వెళ్లి ఆసుపత్రిలో చెక్ చేసుకో…

• నిరుద్యోగుల భవిష్యత్ నాశనమైపోతుంటే తప్పించుకుని తిరుగుతున్న కేసీఆర్ కు సిగ్గు లేదు…

• నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న బండి సంజయ్ కు సిట్ నోటీసులు, కేటీఆర్ లీగల్ నోటీసులిస్తారా? ఏం తప్పు చేశారు? కేసీఆర్ ఆడుతున్న మైండ్ గేమ్.

• విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులారా… మౌనం వీడండి… కదిలి రండి…పోరాడండి… బీజేపీ మీకోసం పోరాడుతోంది.

• తెలంగాణలో అసలు సిసలైన ఉద్యమం మొదలైంది… కేసీఆర్ సర్కార్ ను తరిమికొట్టి బీజేపీ పాలనను తీసుకొద్దాం.. కచరా ప్రభుత్వం మనకొద్దు…

• కదం తొక్కుతున్న నిరుద్యోగ సంఘాలు… బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాకు హాజరై సంఘీభావం తెలిపిన నిరుద్యోగులు

• ఉస్మానియా వర్శిటీలో తీవ్ర ఉద్రికత్త… బండి సంజయ్ నిరుద్యోగ మహాధర్నాకు వెళ్లేందుకు సిద్ధమైన విద్యార్థులను అడ్డుకుంటున్న పోలీసులు.

• పోలీసుల నిర్బంధాన్ని అధిగమించి… పోలీసుల బారికేడ్లను దాటుకుని ఇందిరాపార్క్ వద్దకు బయలు దేరిన ఏబీవీపీ విద్యార్థులు…
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి…

• గ్లోబరీనా సంస్థ నిర్వాకంవల్లే గతంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వంలో చలనం లేదు.

• టీఎస్పీఎస్సీ లీకేజీతో న్యూజిలాండ్ సహా విదేశాల నుండి వచ్చిన వాళ్లకు అత్యధిక మార్కులొచ్చాయి.

• కేటీఆర్ మెడలు వంచాల్సిందే… నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడదాం…

• రాష్ట్రాన్ని దోచుకుంటూ అప్పుల పాల్జేసిన అవినీతి, నియంత పాలన చేస్తున్న కేసీఆర్ కు బుద్ది చెప్పాల్సిందే.

• కేసీఆర్ బిడ్డను ఎట్లా కాపాడాలా? అని కేసీఆర్ కొడుకు, మంత్రులంతా ఢిల్లీ వెళ్లి అరెస్ట్ కాకుండా యత్నిస్తున్నారే తప్ప నిరుద్యోగుల గురించి ఆలోచించే ధ్యాసే లేదు.

• నిరుద్యోగ భ్రుతి కోసం ఐదారు వేల కోట్లు మాత్రమే అవసరం.. వాళ్లకు పైసలివ్వడానికి డబ్బుల్లేవని చెబుతున్న కేసీఆర్ కాళేశ్వరం కాంట్రాక్టర్ కు మాత్రం రూ.లక్ష కోట్లు ఇచ్చారు…

• బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాకు హాజరై సంఘీభావం ప్రకటించిన ఉస్మానియా యూనివర్శిటీ, నిజాం కళాశాల విద్యార్థుల జేఏసీ నాయకులు.. జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్.

• తెలంగాణ మూడు తరాల ఉద్యమ చేసింది. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో చార్మినార్ వద్ద ఆనాటి విద్యార్థులపై తూటాలు పేల్చితే 7 గురు విద్యార్థులు రక్తం మడుగులో గిలగిలా కొట్టుకుంటూ చనిపోయారు.

• భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఏపీ ఏర్పడితే… 1969 వరకు మలి దశ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యోగాలను ఆంధ్రోళ్లు కొల్లగొడుతున్నారనే నినాదంతో ఉద్యమిస్తే… 369 మంది ముక్కుపచ్చలారని ముద్దు బిడ్డలు ప్రాణత్యాగం చేశారు.

• 2001 నుండి 2014 వరకు పార్టీలకు, జెండాలకు, రాజకీయాలకు అతీతంగా మూడో దశ ఉద్యమం జరిగింది. ఉస్మానియా వర్శిటీలో పోరాట బొడ్రాయిని పెట్టి ఉద్యమించింది. సామాన్యుడిని నుండి పెద్దల దాకా జేఏసీని ఏర్పాటు చేసుకుని నీళ్లు-నిధులు-నియామకాల పేరుతో ఉద్యమించాం.

• బండి సంజయ్ చేస్తున్న నిరుద్యోగ మహాధర్నాకు హాజరై సంఘీభావం ప్రకటించిన తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ (టీజేయూ)

• బండి సంజయ్ చేస్తున్న నిరుద్యోగ మహాధర్నాకు హాజరై సంపూర్ణ మద్దతు పలికిన తెలంగాణలోని అన్ని యూనివర్శిటీల విద్యార్థి సంఘాల నాయకులు…

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు…

• నిరుద్యోగ మహాధర్నాకు భారీ ఎత్తున తరలివచ్చిన యువ కిశోరాలకు ఉద్యమ అభినందనలు..

• కేసీఆర్…. ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న ధర్నా సాక్షిగా చెబుతున్నా… సిట్ అధికారులు నాలుగో తరగతి ఉద్యోగులనే ఎందుకు విచారిస్తోంది. ఉన్నతాధికారులను ఎందుకు విచారించడం లేదు?

• టీఎస్పీఎస్సీ తాళాలున్న టీఎస్పీఎస్సీ సెక్రటరీ వద్దకు ఇప్పటి వరకైనా సిట్ ఎందుకు వెళ్లలేదు? ఎందుకు ప్రశ్నంచలేదు?

• టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ను ఇంతవరకు సిట్ అధికారులు ఎందుకు విచారించలేదు? నోటీసులు ఎందుకు ఇవ్వలేదు. అందుకే మాకు సిట్ పై నమ్మకం లేదు…

• ఇద్దరు తప్పిదాలవల్లే లీకేజీ జరిగిందన్నడు కేటీఆర్… ఇన్వెస్టిగేషన్ పూర్తికాకముందే ఇద్దరే దోషులని ఎట్లా ప్రకటిస్తవ్? ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేసి 80 మందికి నోటీసులిచ్చింది.

• సిట్ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే… అక్కడున్న సీసీ పుటేజీని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? ఇవేవీ చేయకుండా ఇద్దరిని మాత్రమే ముద్దాయిలుగా ఇతరులను శుద్ధపూసలుగా ప్రకటించాలని చూస్తున్నరు.

• సిట్ వద్దు…. సిట్టింగ్ జడ్జితో విచారణే ముద్దు అన్నదే బీజేపీ నినాదం….

• పేపర్ లీకేజీతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాల్సిందే. లేనిపక్షంలో 2018లో డిసెంబర్ 9న కేటీఆర్ ప్రకటించినట్లుగా… నిరుద్యోగులకు 2019 జనవరి నుండి నేటి వరకు అంటే 1.19 లక్షల నిరుద్యోగ భ్రుతి ఇవ్వాలి.

• కేటీఆర్ ఎందుకు రాజీనామా చేయాల్సిందే… కేటీఆర్ నిజాయితీపరుడైతే… దేశంలో తొలి రైలు ప్రమాదం జరిగితే దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన తొలి రైల్వే మంత్రి లాల్ బహుదూర్ శాస్త్రీని స్పూర్తిగా తీసుకుని కేటీఆర్ రాజీనామా చేయాల్సిందే…

• కేసీఆర్ ఈ మధ్య కాంగ్రెస్ ను బాగా పొగుడుతున్నడు.. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అంటున్నడు…

• కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే… కాంగ్రెస్ తో కలిసి మీ బీఆర్ఎస్ ఎంపీలంతా రాజీనామా చేసి సంఘీభావం తెలిపాలి. మాట్లాడితే రాజీనామా చేసిన కేసీఆర్ కు చేతనైతే 9 మంది ఎంపీలతో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి రా… తేల్చుకుందాం…

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో అసలు నిందితులెవరో తేల్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇందిరాపార్క్ వద్ద బీజేపీ నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్న బండి సంజయ్ పేపర్ లీక్ కేసులో విచారణ జాప్యం చేస్తూ నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని లేకపోతే భర్తరఫ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణకు అభ్యంతరమేంటని ప్రశ్నించారు.పేపర్ లీక్ కేసులో ఇద్దరే నిందితులన్న కేటీఆర్ సిట్ 11 మందిని ఎందుకు అరెస్ట్ చేసిందో  సమాధానం చెప్పాలన్నారు.  

పరీక్ష రాసి నష్టపోయిన అభ్యర్థులందరికీ రూ. లక్షచొప్పున పరిహారం ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 30 లక్షల నిరుద్యోగుల భవిష్యత్ ను కేసీఆర్ ప్రభుత్వం అందకారం చేసిందన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు అండగా బీజేపీ ఉంటుందన్నారు. వచ్చేది రామరాజ్యమని నిరుద్యోగులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని తెలిపారు. పేపర్ లీక్ కేసులో ప్రభుత్వ మెడలు వంచేదాకా ఉద్యమిస్తామని చెప్పారు. సిట్ అధికారులను తానే రమ్మన్నాని నోటీసులు కూడా తీసుకున్నానని బండి సంజయ్ చెప్పారు. కేసీఆర్ కొడుకు నౌకరీ ఊడగొట్టాలె మా నౌకరీలు మాకు కావాలె అని బండి సంజయ్ అన్నారు.

బీజేపీ మహా ధర్నా

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజీలపై బీజేపీ మహా ధర్నా చేపట్టింది. మార్చి 25వ తేదీన హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర నిరుద్యోగులతో కలిసి ఉద్యమం చేపట్టింది బీజేపీ. పార్టీ నేతలు, కార్యకర్తలతోపాటు నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

పేపర్ లీకేజీలతో అన్నీ పరీక్షలు రద్దు చేశారని 30 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి డిమాండ్లు పెట్టారు. అవి పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు బీజేపీ శ్రేణులు. 

Related News:

డిమాండ్స్

TSPSC ఎగ్జామ్ పేపర్ లీకేజీకి కారణమైన మంత్రి కేటీఆర్ ను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కేటీఆర్ పాత్రపై విచారణ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

మరో డిమాండ్ పరిశీలిస్తే TSPSC పేపర్ లీకేజీపై సిట్ విచారణ సరిపోదని, సిట్ పై నమ్మకం లేదని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ.

మరో ప్రధానమైన డిమాండ్ చూస్తే TSPSC పరీక్షలు రాసి నష్టపోయిన అభ్యర్థులు, నిరుద్యోగులు ఒక్కొక్కరికి లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలి డిమాండ్ చేస్తోంది బీజేపీ.

ఉద్యోగాలు వదిలేసి సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకున్నారని, ఇప్పుడు పరీక్ష పేపర్ల లీకేజీ వల్ల అందరూ నష్టపోయారని, వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని, అభ్యర్థులు అందరికీ, నిరుద్యోగులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ.

మా నౌకరీలు మాగ్గావాలె…

మా నౌకరీలు మాగ్గావాలె అనే నినాదంతో  హైదరాబాద్  ఇందిరాపార్క్ దగ్గర నిరుద్యోగ మహా ధర్నాకు బీజేపీ పిలుపు ఇవ్వడంతో భారీగా నిరుద్యోగులు, బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు  ఇందిరాపార్కుకు చేరుకున్నారు. బీజేపీ మహా ధర్నా నేపథ్యంలో ఇందిరాపార్కు పరిసరాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. భారీగా పోలీసులు మోహరించారు. 

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో రాష్ట్రప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బీజేపీ నిరుద్యోగ మహాధర్నా చేస్తోంది.  పరీక్షల పేపర్‌ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్‌ అంధకారంలో పడిన నేపథ్యంలో వారి తరపున పోరాడేందుకు పార్టీ దశలవారీ ఉద్యమ కార్యాచరణ రూపొందించింది.

ఇందులో భాగంగా బండి సంజయ్‌ నేతృత్వంలో ఇందిరాపార్క్‌ వద్ద వేలాది మందితో ‘మా కొలువులు మాగ్గావాలే’ అనే నినాదంతో నిరుద్యోగ మహాధర్నా చేపట్టారు. ధర్నాలో  పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ధర్నాకు యువజన సంఘాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో ఇందిరాపార్కు దగ్గర పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. 

ఇందిరాపార్కు దగ్గర బీజేపీ తలపెట్టిన మహాధర్నాకు ప్రభుత్వం ముందు అనుమతి ఇవ్వలేదు. దీంతో ధర్నాకు అనుమతివ్వాలంటూ  బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. బీజేపీ  మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 500మందితో మహాధర్నా నిర్వహించుకోవాలని సూచించింది. అంతేకాకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు సూచించింది.

సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లు నిషేధం

మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో బోర్డులో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక నుంచి టీఎస్పీఎస్సీల్లో సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లపై నిషేధం విధించింది. మార్చి 27వ తేదీ సోమవారం నుంచి ఉద్యోగులు ఎవరూ కూడా టీఎస్పీఎస్సీ కార్యాలయంలోకి సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లను తీసుకురావద్దని ఆదేశించింది. 

అభ్యర్థుల నుంచి వచ్చే ఎలాంటి ఫిర్యాదులు అయినా ఆన్ లైన్ లోనే తీసుకోవాలని నిర్ణయించింది. పేపర్లు, పరీక్షల్లో సమస్యల పరిష్కారానికి అవసరమైతే ప్రత్యేక ఆన్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఎవరూ కూడా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వకూడదని బోర్డు నిర్ణయించింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X