ఈ రోజు గాయకుడు ఘంటసాల 99 జయంతి. మమతల మలయ మారుత తరంగం. సముద్ర అలల సోయాగపు ప్రవాహం. సీని జగత్తులో స్వర్ణమయ సంగీత చిహ్నము. “ఘంటశాల” నామం సుస్థిర రాగముల నిలయం… హృదయాలను కమ్మని పాటలతో కదిలించే సంగీత సరస్వతి లలిత మాధుర్యం కురిపించే అలసిన మనసుకు రాగాలాపన గంగా పానం చేయించే మధుర కోయిల కూతలతో మనసులు పులకరించే. తరాలు మారినా పాటల అమృతభాండం. మకరందపు రుచులు మరిగిన స్వర గంగాధరం. చల్లని గాలులు పరవశించే మధుర పాటలతో. మనసును దోచిన రసమయ రాగాలాపనలు. పాటల సంపద నిధులు దాచుకున్న భూగర్భం. పాతాళపు చీకటి పాలద్రోలి కంఠము. బ్రతుకు బాటలో సన్నజాజుల విరహపు స్వప్నము. అల్లుకున్న పద బంధాలకు పోసేను సంగీత ప్రాణం. గంధర్వ లోకములో వినిపించేందుకు వెళ్లే గానం. ఇంద్రసభలో నర్తించే నాట్య మణులకు పోటీగా. పారిజాత పుష్పాలు ఉప్పొంగే గానముతో. రేకులు విచ్చుకొని పరవశించే నందనోద్యాన వనం. ఆస్వాదించే కొద్ది చెవులకు కుతూహలం ఎన్నిసార్లు ఆలకించిన అదే తీయటి జ్ఞాపకం. పాఠకుల హృదయాలలో ఆ రూపము సజీవం. చరిత్రలో “ఘంటసాల “స్థానం ఎప్పటికీ సుస్థిరం..
సంగీత సామ్రాట్ సినీ వినీలాకాశంలో వెలుగొందిన ఘంటసాల వెంకటేశ్వరరావు తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. ఘంటసాల జన్మతః వచ్చిన గంభీరమైన స్వరంతో, పట్రాయని సీతారామశాస్త్రి వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో, తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఘంటసాల తెలుగు సినిమా జగత్తులో తొలితరం నేపథ్యగాయకులలో ఒకరు. వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగు నాట ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందుతూ ఉంది.
ఘంటసాల జననం 1922 డిసెంబర్ 4 న గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించాడు. సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి అతన్ని బాల భరతుడు అని పిలిచేవారు. ఘంటసాల 11వ ఏట తండ్రి సూర్యనారాయణ మరణించారు. చివరి రోజుల్లో అతను సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి ఆయన్ను గొప్ప సంగీత విద్వాంసుడిని అవమని కోరారు..
1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలైన సావిత్రిని పెళ్ళిచేసుకున్నాడు. ఆరోజు సాయంత్రం తనపెళ్ళికి తానే కచేరీచేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడు. కొన్నాళ్ళకు దగ్గరివూరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినపుడు ఆయన్ను కలిసాడు. ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాల ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నాడు. ఘంటసాల రెండునెలలు కష్టపడి కచేరీలుచేసి, కొంత అప్పుచేసి మద్రాసు వెళ్ళాడు. సముద్రాల ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిల ముందు పాటకచేరీ చేయించాడు. వారిరువురు ఘంటసాల పాటవిని అవకాశాలు ఉన్నపుడు ఇస్తామన్నారు.
ఇల్లు చాలాచిన్నది కావడంతో అతనుకు ఇబ్బంది కలిగించడం ఇష్టంలేక ఘంటసాల తన మకాంను పానగల్ పార్కు వాచ్‌మన్‌కు నెలకు రెండురూపాయలు చెల్లించే పద్ధతిపై అక్కడకు మార్చాడు. పగలంతా అవకాశాలకోసం వెతికి రాత్రికి పార్కులో నిద్రించేవాడు. సముద్రాల అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించాడు. ఇలాపాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసేవాడు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపుపొందాడు. ఘంటసాలచేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిలు తమ సినిమా స్వర్గసీమలో మొదటిసారి నేపథ్యగాయకుడి అవకాశాన్ని ఇచ్చారు. భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. ఆపాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది.
భానుమతి, రామకృష్ణలు తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీతదర్శకునిగా చేసే అవకాశం వచ్చింది. తర్వాత బాలరాజు, మనదేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు. ఘంటసాల ఎంత గొప్పస్థితికి చేరుకొన్నా తనను ఆదరించిన వారిని మరువలేదు. అతను ఎన్నడూ మరొకరిని నొప్పించేవాడుకాదు. కోరినవారికి కాదనక సహాయంచేసేవాడు. “నాడు ఏతల్లి మొదటి కబళం నా జోలెలో వేసిందో ఆమె వాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది” అని ఎన్నోసార్లు చెప్పేవాడు.
పానగల్ పార్కులో కష్టాల్లో ఉన్నపుడు కూడా తోటివారికి ఆకలిగా ఉన్నపుడు భోజనాలు కల్పించేవాడు. సంగీతాభ్యాసం చేస్తున్నరోజుల్లో తనను అన్నా అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడినైతే వాచీ కొనిస్తానని చెప్పాడు. కొన్నేళ్ళకు పాపారావు అన్నా గొప్పవాడివయ్యావు కదా నా వాచీ ఏదీ అని ఉత్తరం రాయగా నూరు రూపాయలు పంపించాడు. కానీ అప్పటికే పాపారావు టైఫాయిడ్ వచ్చి మరణించాడు. తరువాత పాపారావు కుమారుడు నరసింగరావును తన ఇంట పెంచి తనకుమారుడిగా చూసేవాడు.ఘంటసాల జీవిత చరిత్ర ఘంటసాల ది గ్రేట్ అనే పేరుతో సినిమాగా వచ్చింది. దీనికి ఆయన అభిమాని సి.హెచ్ రామారావు దర్శకత్వం వహించాడు. ఇందులో గాయకుడు కృష్ణచైతన్య, అతని భార్య మృదుల జంటగా నటించారు.కానీ ఈ చిత్రం ఘంటసాల కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో విడుదల కాలేదు.
1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవాడు. 1970లో అతనికి పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో ఐరోపాలో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేసాడు. 1972 లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరాడు. అప్పటికే మధుమేహంతో బాధపడుతూ ఉన్నాడు. చాలారోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యాడు.
ఘంటశాల కు ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరిక కలిగింది. భగవద్గీత పూర్తిచేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నాడు. 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడాడు. 1974 నాటికి అతను ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఆస్పత్రిలో కన్నుమూసాడు.
(జన ప్రతిధ్వని పత్రికలో ఈరోజు)
![](https://telanganasamachar.online/wp-content/uploads/2022/12/gurujada.5.png)
– రచయిత కొప్పుల ప్రసాద్ (9885066235)