హిందీ దివస్-2023 ప్రత్యేక వ్యాసం: ప్రపంచాన వెలుగులీనుతున్న హిందీ

ఏదేని దేశ సంస్కృతికి వాహకము ఆ దేశ భాషయే. భాష లేకుండా సంస్కృతి వెలుగులోకి రావడం అసంభవం. ఆ విధంగా భాషకు, సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రాచీన భారతదేశం బహుభాషా దేశం. ఇక్కడ విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మరియు ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష మాట్లాడడం జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లో మాట్లాడే భాషలను ప్రాంతీయ భాషలంటారు. వీటి ద్వారా కేవలం ఆ ప్రాంతంలోనే కార్యకలాపాలు జరపవచ్చు. ఆ ప్రాంతం దాటి ఇతర ప్రాంతాల్లో వ్యవహారాలు కొనసాగించాలంటే అందరికీ అర్థమయ్యే ఒక భాష అవసరం. నాటినుండి నేటి వరకు ఆ అవసరం తీర్చుతున్న భాష హిందీ.

MIDHANI

స్వాతంత్ర్యం కోసం ఉద్యమం ఊపందుకున్నప్పుడల్లా, హిందీ ప్రగతి రథం కూడా వేగంగా ముందుకు సాగింది. హిందీ జాతీయ చైతన్యానికి చిహ్నంగా మారింది. స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులు గత 600-700 సంవత్సరాలుగా భారతదేశ ఐక్యతకు కారణం హిందీ అని గుర్తించారు.

హిందీకి జాతీయ భాష హోదా కల్పించేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన జాతీయ నాయకులలో మహాత్మా గాంధీకి అత్యంత ప్రాధాన్యత ఉంది. హిందీని భారతదేశమంతటా వాడుక భాషగా మార్చడంలో, దానిని అనుసంధాన భాషగా అభివృద్ధి చేయడంలో మరియు జాతీయ భాష హోదా కల్పించడంలో మహాత్మా గాంధీ పాత్ర సాటిలేనిది. గాంధీజీ దక్షిణాఫ్రికాలో హిందీ ప్రాముఖ్యతను అంచనా వేశారు. దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ వారి వర్ణవివక్ష విధానాలకు, దురాగతాలకు నిరసనగా గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు మొదలైన భాషలు మాట్లాడే పిల్లలు నెటాల్ సత్యాగ్రహ ఆశ్రమంలో నివసించారు. వివిధ భాషల పిల్లలు ఆడుకుంటూ హిందీ మాట్లాడటం గాంధీజీ గమనించారు. దీని నుండి అతను హిందీ వివిధ భాషలవారి మధ్య కమ్యూనికేషన్ (అనుసంధాన)భాష అని గుర్తించాడు. ఆ పిల్లలకు హిందీ ద్వారా బోధించడం ప్రారంభించాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, గాంధీజీ దేశం మొత్తం పర్యటించారు మరియు దేశ సమైక్యతలో హిందీ ప్రాధాన్యతను గుర్తించి, దేశ వ్యాప్తంగా హిందీ భాషాభివృద్ధికి పాటుపడ్డారు.

1910లో గాంధీజీ ఇలా అన్నారు- “భారతదేశం నిజంగా స్వతంత్ర దేశంగా మారాలంటే, ఎవరి విశ్వాసమేదైనా సరే హిందీని జాతీయ భాషగా స్వీకరించాల్సిందే”

1916లో, లక్నో కాంగ్రెస్ సమావేశంలో, గాంధీజీ హిందీలో ప్రసంగిస్తూ, స్పష్టంగా ఇలా ప్రకటించారు ‘స్వరాజ్య స్థాపన ఎంత ముఖ్యమో హిందీ ప్రచారం కూడా అంతే ముఖ్యం’. అదే సెషన్‌లో డిసెంబర్ 26న ‘ఆర్యసమాజ్ పెవిలియన్’లో గాంధీజీ అధ్యక్షతన ‘ఒక భాష ఒకే లిపి’ అనే అంశంపై ‘ దేశం యొక్క ప్రయోజనం మరియు ఐక్యతను స్థాపించడం కోసం హిందీ భాష, దేవనాగరి ప్రచారం జరగాలని’ ఏకగ్రీవ తీర్మానం చేశారు. తమిళం మాట్లాడే శ్రీరామస్వామి అయ్యర్ మరియు శ్రీ రంగస్వామి అయ్యర్ ఈ ప్రతిపాదనకు మద్దతుదారులుగా నిలిచారు.

దేశ ప్రజలను ఐక్యతా భావంతో నింపిన భాష హిందీ

భారత దేశంలో అత్యధికంగా మాట్లాడే భాష, అర్థం చేసుకునే భాష హిందీ. దేశంలోని అన్ని రాష్ట్రాలను కలిపే సమర్థత కలిగిన భాష హిందీ. హిందీ ఒక ప్రాచీన భాష. స్వాతంత్రోద్యమ కాలం కంటే ముందు నుండే దేశ ప్రజలను ఐక్యతా భావంతో నింపిన భాష హిందీ. గొప్ప సాహిత్యం కలిగినటువంటి భాష. ప్రేమ్ చంద్, హజారీ ప్రసాద్ ద్వివేది, కాకా కాలేల్కర్, సేథ్ గోవింద్ దాస్, బిహార్ రాజేంద్ర సింహా, మాఖన్ లాల్ చతుర్వేది, మహాదేవి వర్మ, సుమిత్రానందన్ పంత్, సుభద్ర కుమారి చౌహన్ లాంటి ఎందరో గొప్ప సాహితీకారులు, కవులను కలిగినటువంటి భాష హిందీ.

అంతర్జాతీయ హిందీ దినోత్సవం

అలాంటి హిందీని భారత అధికారిక భాషగా గుర్తించడంలో బిహార్ రాజేంద్ర సింహా గారి కృషి ఎనలేనిది. వారి కృషి ఫలితమే సెప్టెంబర్ 14,1949న హిందీని అధికారిక భాషగా ప్రకటించడం జరిగింది. అంతేకాదు సెప్టెంబర్ 14 బిహర్ రాజేంద్ర సింహా గారి పుట్టినరోజు కావడం కూడా మరో విశేషం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 343(1) ప్రకారం దేశంలోని గుర్తించబడ్డ 22 భాషల్లో హిందీని అధికారిక భాషగా గౌరవించిన ఈ రోజున, హిందీ భాష కోసం విశేషంగా కృషి చేసిన వ్యక్తులకు లేదా సంస్థలకు రాజ్ భాషా కీర్తి పురస్కార్ లేదా రాజ్ భాషా గౌరవ పురస్కార్ లాంటి అవార్డులను అందజేయడం జరుగుతుంది. అంతేకాదు పాఠశాల, కళాశాల స్థాయిలో వివిధ కార్యక్రమాలను నిర్వహించి ఘనంగా హిందీ దివస్ వేడుకలు జరుపుకుంటారు. ఇలా సెప్టెంబర్ 14 న జాతీయ దినోత్సవం జరుపుకుంటే, 1975లో నాగపూర్ లో జనవరి 10వ తేదీన జరిగిన తొలి అంతర్జాతీయ హిందీ సమావేశమునకు గుర్తుగా ప్రతి సంవత్సరం జనవరి 10వ తేదీన అంతర్జాతీయ హిందీ దినోత్సవం జరుపుకుంటారు.

హిందీ భాష ప్రాముఖ్యత

నేడు హిందీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతోంది. ఈ ప్రపంచీకరణ యుగంలో, హిందీ తన ఉపయోగాన్ని నిరూపించుకోవడంలో విజయం సాధించింది. హిందీ భారతదేశ ప్రజల హృదయ భాష మాత్రమే కాదు, అది ప్రపంచంలోని ప్రతి మూలలో కూడా కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. ఒకవైపు దక్షిణాఫ్రికా, ఫిజీ, మారిషస్, గయానా, ట్రినిడాడ్, సురినామ్ వంటి దేశాల్లోనూ, మరోవైపు అమెరికా, రష్యా, జపాన్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ వంటి అన్ని ప్రధాన దేశాల్లోనూ హిందీ మూలాలు నిరంతరంగా సాగుతున్నాయి. కొరియా, చైనా, పోలాండ్ మొదలైనవి ఈ ప్రపంచీకరణ యుగంలో తమ మనుగడ సాగించడానికి హిందీపై ఆధారపడవలసి వస్తుంది.

600కు పైగా విశ్వవిద్యాలయాలు మరియు పాఠశాలల్లో హిందీ

దీనికి ప్రత్యేకంగా స్పష్టమైన రుజువు అవసరం లేదు. నేడు ప్రపంచంలోని నలభైకి పైగా దేశాలలో 600కు పైగా విశ్వవిద్యాలయాలు మరియు పాఠశాలల్లో హిందీ బోధించబడుతోంది. హిందీ విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు కమ్యూనికేషన్ భాష మాత్రమే కాదు, ఇతర వ్యక్తులకు కూడా ఆసక్తికరమైన భాషగా మారింది. దేశంలో హిందీ సర్వవ్యాప్తి తెలిసిందే. తూర్పు, పశ్చిమ, ఉత్తర లేదా దక్షిణ భారతీయులు తమ మాతృభాష మాట్లాడతారో లేదో అనే తేడా లేకుండా, వారందరూ హిందీ భాషలోనే సంభాషిస్తారు.

ఖండాలను దాటి హృదయాలను కలిపే భాష

“హిందీ అబ్ దేశ్ కో జోడ్నే వాలీ భాషా హీ నహీ, దిలోంకో జోడ్నే వాలీ భాషా హై” (హిందీ ఇప్పుడు దేశాన్ని ఏకతాటిపై కలిపే భాష మాత్రమే కాదు, ఖండాలను దాటి హృదయాలను కలిపే భాష కూడా.

ఈ భాష పాత్ర అత్యంత కీలకం

భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లోని ప్రజలు ఈ భాష నేర్చుకునేందుకు అధికంగా ఆసక్తి చూపుతున్నారు. హిందీ భాష లిపి దేవనాగరి లిపి. ఈ లిపి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఏదైతే రాస్తారో, అదే చదువుతారు. అంటే ఇందులో నిశ్శబ్ద పదాలు (సైలెంట్ వర్డ్స్) ఉండవు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునేవారికి, విదేశాల్లో చదువు, ఉద్యోగంకై వెళ్ళే వారికి, సివిల్స్ సర్వీసెస్ లాంటి ఉద్యోగాల సాధనలోను ఈ భాష పాత్ర అత్యంత కీలకం.

హిందీకి ప్రాముఖ్యత పెరిగింది

మారుతున్న కాలానికి అనుగుణంగా హిందీకి ప్రాముఖ్యత పెరిగింది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా హిందీ మాట్లాడేవారు సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. స్వాతంత్ర ఉద్యమంలో ఈ భాష కీలకపాత్ర పోషించింది. జాతిపిత మహాత్మా గాంధీ తన సమావేశాలు, ఉపన్యాసాలు ప్రజలకు చేరేలాగా హిందీ భాషనే వినియోగించారు. అందులో భాగంగా హిందీ ప్రచార సభలు స్థాపించారు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల జాబితాలో హిందీ భాష రెండో స్థానం దక్కించుకుంది.

అనేక దేశాల్లో హిందీకి గౌరవప్రదమైన హోదా లభించింది

ఆధునికత వైపు వేగంగా దూసుకెళ్తున్న కొందరు భారతీయులు ఇంగ్లీషులో మాట్లాడుతున్నందుకు గర్వంగా భావించవచ్చు, కానీ నిజం ఏమిటంటే ప్రపంచంలోని అనేక దేశాల్లో హిందీకి గౌరవప్రదమైన హోదా లభించింది. ఇది మాత్రమే కాదు, మన అధికార భాష హిందీ వల్ల ప్రపంచ స్థాయిలో ప్రతి భారతీయుడికి గౌరవం లభిస్తోంది. హిందీ ప్రపంచంలోని పురాతన, గొప్ప మరియు సరళమైన భాషలలో ఒకటి, ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలలో మాట్లాడబడుతుంది.

త్రిభాషా సూత్రం

ఇండో యూరోపియన్ భాష కుటుంబ సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకున్న హిందీ నిస్సందేహంగా అత్యధిక దేశ జనాభా ఆదరణకు గురవుతున్న మాట వాస్తవం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 54 శాతం హిందీ మాట్లాడే వారున్నారు. ఉత్తర మధ్య భారత ప్రాంత 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు హిందీని మొదటి భాషగా ఎంపిక చేసుకున్నారు. పంజాబ్, గోవా, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా అత్యధికులు హిందీని రెండవ లేదా మూడో భాషగా ఎంచుకున్నారు. త్రిభాషా సూత్రం ప్రకారం పలు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాల్లో మాతృభాషలకున్న ప్రాధాన్యత హిందీకి లేదు. బ్యాంకులో తదితర కేంద్ర పాలన సంస్థల ఉద్యోగ ఉపాధి వ్యవహారాలలో హిందీ రాజభాషగా చలామణి అవుతుంది.

హిందీ భాషాభిమానులు కోరుతున్నారు

దక్షిణ భారతదేశంలో 73 శాతం హిందీ భాషా ప్రచారకులు, దక్షిణ భారత హిందీ ప్రచార సభలో చురుకుగా హిందీ నేర్పుతున్నారు. ఉత్తర భారత నుంచి దక్షిణాది వైపు అసంఖ్యాకంగా వలస వచ్చే అసంఖ్యాక కార్మికుల అవసరాలకు, సంభాషణ సౌకర్యాలకు హిందీ భాషనే ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా హిందీని జాతీయ అనుసంధాన భాషగా చెప్పవచ్చు. భారత జాతి ఐక్యత దృష్ట్యా హిందీ భాష ఆవశ్యకతను గుర్తించి, హిందీ భాషను మరింత సుసంపన్నం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా హిందీని పాఠశాల, కళాశాల, డిగ్రీ కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో కచ్చితంగా ఒక సబ్జెక్ట్ గా ఉంచి, భాషాభివృద్ధికి కృషి చేయాలని హిందీ భాషాభిమానులు కోరుతున్నారు.

శుభాకాంక్షలు

దక్షిణాదిలో పదవ తరగతి వరకే హిందీని బరువైన బాధ్యతగా త్రిభాషా సూత్రానికి లోబడి అమలు పరుస్తున్నారు. ప్రభుత్వాలు భాషాబోధకులకు పదోన్నతులు కల్పించి, ప్రమాణాలు పెంచే ప్రయత్నాలు చేస్తే పాఠశాల స్థాయిలోనే భాషావికాసానికి ప్రోత్సాహం కల్పించినట్లవుతుంది. జాతి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న హిందీ భాషాభిమానులందరికీ హిందీ దినోత్సవ (హిందీ దివస్) శుభాకాంక్షలు.

– డా. కమలేకర్ నాగేశ్వర్ రావు ‘కమల్’
‘హిందీ సేవి’అవార్డు గ్రహీత,
ఉపాధ్యాయులు
ఉప్పునుంతల,నాగర్ కర్నూల్ జిల్లా.తెలంగాణ
9848493223
dilwaali7@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X