జయంతి స్పెషల్: కామ్రేడ్ చారుమజుందారికి 50 ఏండ్లు, కానీ ఆయన మార్గానికి 100 ఏండ్లు!

53 ఏళ్ళు బతికిన మనిషి, కేవలం ఆరంటే ఆరేళ్ళు నాయకత్వం వహించిన ఉద్యమం 50 ఏళ్ళు దాటి వేలాదిమంది నెత్తుటి తర్పరణలతో అప్రతిహతంగా విజయం దిశగా ముందుకు సాగుతూ… పోరాటం అనే పదానికి, ఉత్తేజం అనే విశేషానికి, విప్లవం అనే అక్షరాలకి పర్యాయ పదం అవుతాడని ఎవరైనా నమ్మగలరా…? ఆవును… ఆయన కామ్రేడ్ చారూ మజుందార్, అది.. ఆయన చరిత్ర గామలిచిన నక్సల్బరీ, ఆయన… అప్పటికీ… ఎప్పటికీ విప్లవానికి పర్యాయ పదం. ఆయన… విముక్తికి ఏకైక నిర్వచనం. నక్సల్బరీ ఉద్యమ రూపశిల్పి. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు-లెనినిస్టు) పార్టీకి సంస్థాపక ప్రధాన కార్యదర్శి చారు మజుందార్ గారు అమరుడు అయిన ఈ దినం ! మార్క్సిస్టు-లెనినిస్టులకు “అమరవీరుల దినం”… జోహార్లు..!!

చావులేని చారుశీలికి – శ్రీశ్రీ

విద్యుత్తులు ప్రవహించే నీ నరాల్తో
విప్లవం శాలువ అల్లినవాడా
తెల్ల భయాని కెదురుగుండా
ఎర్ర భీభత్సం చల్లినవాడా

ఉడుకునెత్తురు ఉప్పొంగే
యువతీ యువకుల్ని అడవుల్లోకి పంపించినవాడా
అడవుల్లోంచి మైదానాల్లోకి ఆనందం దింపించినవాడా

ఆలోచనల్ని హీటెక్కించి
ఆచరణగా మార్పించినవాడా.
అన్యాయాల్ని బోనెక్కించి
ఆయుధానికి ఆ ఆలు నేర్పించినవాడా

భ్రమకి డమరుకం కట్టి
శ్రమకి బొమిడికం పెట్టి
జులుం పని పట్టించినవాడా
జనం బలం అనే నిశ్రింకతో
ధనం వ్రణం శస్త్రించినవాడా

డియర్ కామ్రేడ్ చారుమజుందార్ అందుకో మా అందరి జోహార్.

సి.ఎం.గా సుప్రసిద్ధుడైన చారు మజుందార్ (1918 – జూలై 28, 1972) నక్సలైటు నాయకుడు, నక్సల్బరీ ఉద్యమ రూపశిల్పి. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు-లెనినిస్టు) పార్టీకి సంస్థాపక ప్రధాన కార్యదర్శి. అతని ప్రేరణ వల్ల ఎంతో మంది యువకులు విప్లవోద్యమంలో చేరారు. కార్మికులతో, కర్షకులతో అనుసంధానమై వాళ్ళ పోరాటాలలో పాల్గొన్నవారే చివరిదాకా విప్లవకారులుగా నిలబడగలుగుతారని ఆయన యువతకి చెప్పాడు. అతను మరణించిన జూలై 28వ తేదీని భారతదేశంలోని మార్క్సిస్టు-లెనినిస్టులు “అమరవీరుల దినంగా” పాటిస్తారు.

బాల్యం…

చారు మజుందార్ 1918 ల సిలిగురిలోని ఒక జమీందారు కుటుంబంల జన్మించాడు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన పెట్టి-బూర్జువా జాతీయ విప్లవకారులచే ప్రభావితుడై అనుశీలన్ గ్రూపుకి అనుబంధ సంస్థ అయిన బెంగాల్ విద్యార్థి సంఘంల (All Bengal Students Association) సభ్యునిగా చేరాడు. న్యాయవాది అయిన అతని తండ్రి కాంగ్రెస్‌లో చురుకైన స్వాతంత్ర్య సమరయోధుడు. అతని తల్లి ఆమె కాలానికి ప్రగతిశీల భావాలు కలది. 1937-38 ల ఆయన కళాశాల విద్యను వదిలిపెట్టి, కాంగ్రెస్ కార్యకర్తగా బీడీ కార్మికులను, ఇతరులను సంఘటిత పరిచాడు.

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో…

కొన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ని వదిలిపెట్టి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)ల చేరి రైతు సంఘంల పనిచేసాడు. మొదట జల్‌పైగురి రైతులతో పనిచేసి వారిలో సర్వసమ్మతమైన నాయకునిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రభుత్వం అతని మీద అరెస్టు వారెంటు జారీ చేయగా అతను అజ్ఞాతంలకి వెళ్ళాడు. రెండవ ప్రపంచ యుద్ధం మొదలవ్వగానే సి.పి.ఐ పార్టీ నిషేధించబడింది. రైతులతో రహస్య కార్యకలాపాలు నిర్వహించి, 1942 ల కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జల్‌పైగురి జిల్లా కార్యవర్గంల సభ్యుడయ్యాడు. 1943 ల పెద్ద కరువు వచ్చినపుడు, జల్‌పైగురిల పంటలను స్వాధీనపర్చుకోడానికి అందరినీ సంఘటితపరిచాడు. 1946ల ‘తెభాగ’ ఉద్యమంల పాల్గొని, ఉత్తర బెంగాల్ రైతు పోరాటాలను నిర్వహించాడు. ఈ ఉద్యమం ఆయనపై ప్రగాఢ ప్రభావం చూపి, సాయుధ రైతాంగ విప్లవోద్యమంపై ఆయన ఆలోచనలకు స్పష్టతనేర్పరచింది. తర్వాత ఆయన డార్జిలింగ్ జిల్లాల తేయాకు కార్మికులతో పనిచేసాడు.

1984ల సి.పి.ఐ నిషేధించబడగా ఆయన తర్వాతి మూడు సంవత్సరాలు జైలుల గడిపిండు. 1954 జనవరిల జల్‌పైగురికి చెందిన సి.పి.ఐ సభ్యురాలు లీల మజుందార్ సేన్‌గుప్తను ఆయన వివాహమాడిండు.

రైతాంగ పోరాటం తగ్గుముఖం పట్టడంతో తేయాకు కార్మికులు, రిక్షా కార్మికులను సంఘటితపర్చడానికి అతను కృషి చేసాడు. 1956ల పాల్‌ఘాట్ కాంగ్రెస్ తర్వాత, పార్టీతో ఆయనకున్న అభిప్రాయ భేదాలు పెరిగాయి. ఆయనకున్న ఇబ్బందికర పరిస్థితులకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు తోడయ్యాయి. కాని అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంల జరుగుతున్న పెద్ద చర్చ (The Great Debate) ఆయనకు ఉత్తేజాన్ని ఇచ్చింది. ఇండో-చైనా యుద్ధం సందర్భంగా ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళాడు.

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)లో….

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ చీలికతో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)ల చేరినా, ముఖ్యమైన సైద్ధాంతిక ప్రశ్నలపై నాయకత్వం తప్పించుకుంటునట్టు అతను భావించాడు. 1964-65 ల అతని ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కమ్యూనిజం, మావో ఆలోచన గురించి అధ్యయనం చేయడానికి, రాయడానికి సమయాన్ని వినియోగించాడు. 1965-67 వరకు అతని రచనల వల్ల, ఉపన్యాసాల వల్ల నమోదు చేయబడిన అతని భావాలు ఈ సమయంలోనే ఏర్పడ్డాయి. అవే తర్వాత చారిత్రక ఎనిమిది పత్రాలు (Historic Eight Documents ) గా పిలువబడి నక్సల్బరి ఉద్యమానికి రాజకీయ-సైద్ధాంతిక మూలం అయ్యాయి.

1967ల నక్సల్బరీ ఉద్యమం మొదలైన తర్వాత పోలీసులకి పట్టుబడకుండా చారు మజుందార్ అజ్ఞాతం లోకి వెళ్ళిపోయాడు. కొన్ని వారాల తర్వాత ఆయన ఇట్లా రాసాడు, “వందలాది నక్సల్బరీలు భారతదేశంల నిప్పు రాజుకుంటున్నయి… నక్సల్బరీ చావలేదు, నక్సల్బరీకి చావు లేదు.”

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు-లెనినిస్టు) ఏర్పాటు……

మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనను వ్యాపింపజేస్తూ, దీని మూలంగా అన్ని కమ్యూనిస్టు విప్లవకారులను ఏకం చేస్తూ, నక్సల్బరీ తరహా రైతాంగ విప్లవ పోరాటాలను వృద్ధి చేసే లక్ష్యంతో ఏప్రిల్ 1969లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు-లెనినిస్టు) (సి.పి.ఐ.ఎం.ఎల్) ఏర్పడింది. మే 1970, సి.పి.ఐ.ఎం.ఎల్ కాంగ్రెస్ సమావేశంల ఏర్పడిన కేంద్రకమిటీకి ఆయన ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాడు. తర్వాత కాలంలో ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు మాయం చేయబడినా, చాలా మంది ముఖ్య నాయకులు చంపబడినా, అనారోగ్యంతో ఉన్న ఆయన పోలీసులనుండి తప్పించుకోగలిగాడు.

పోలీసు నిర్బంధంల మరణం

జూలై 16, 1972న, కొరియర్‌ని చిత్రహింసలు చేయగా తెలిసిన సమాచారంతో ఆయన కలకత్తాలోని ఒక స్థావరంలో పట్టుబడ్డాడు. పట్టుబడిన సమయంలో ఆయన గుండెజబ్బు వలన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పోలీసు నిర్బంధంలో ఆయన ఉన్న పది రోజులు ఆయనను చూడడానికి ఆయన న్యాయవాదిని కాని, కుటుంబ సభ్యులని కాని, వైద్యున్ని కాని పోలీసులు అనుమతించలేదు. 1972 జూలై 28 తెల్లవారుఝామున 4 గంటలకు, చారు మజుందార్ లాల్‌బజార్ పోలీస్ నిర్బంధంలో మరణించాడు. ఆయన శవాన్ని కూడా ప్రభుత్వం కుటుంబానికి అందజేయలేదు. పోలీసులు కుటుంబ సభ్యులతో శవాన్ని ఒక దహనవాటికకు తీసుకపోయి, సమీప బంధువులను కూడా రానివ్వకుండా కట్టుదిట్టం చేసి ఆయన శవాన్ని దహనం చేశారు. ఆయన మరణంతో భారత దేశములో విప్లవోద్యమ మొదటి ఘట్టం ముగిసింది.

చారుమజుందారికి 50 ఏండ్లు, కానీ ఆయన మార్గానికి 100 ఏండ్లు !

ఓ చిన్న చెకుముకి రాపిడి చెదలుబారిన చట్టాల పాలిట చితిమంట కావడాన్ని ఎవరైనా ఊహించగలరా…?

ఉందో లేదో తెలియని ఊపిరి ప్రతీ ఒక్కరి నరాల్లో నిప్పుల ఉప్పెనై ఊరుకులెత్తించడాన్ని ఎవరైనా విశ్వసించగలరా…?

ఉన్నత విద్య అనేదే ఎరుగని ఆ మేధస్సు ప్రతీ విశ్వవిద్యాలయం ఉగ్రరూపమెత్తి పరవళ్లు తొక్కేలా చేయడాన్ని ఎవరైనా చూడగలరా…?

ఎముకలు, చర్మం తప్ప మరేమీ లేని 43 కిలోల ఆ బక్కపల్చని ఆకారం ఎందరి గుండెల్లో పచ్చబొట్టయి నిలిచిపోయిందో ఎవరైనా ఆలోచించగలరా…?

కేవలం 53 ఏళ్ళు బతికిన మనిషి, కేవలం ఆరంటే ఆరేళ్ళు నాయకత్వం వహించిన ఉద్యమం 50 ఏళ్ళు దాటి వేలాదిమంది నెత్తుటి తర్పరణలతో అప్రతిహతంగా విజయం దిశగా ముందుకు సాగుతూ… పోరాటం అనే పదానికి, ఉత్తేజం అనే విశేషానికి , విప్లవం అనే అక్షరాలకి పర్యాయ పదం అవుతాడని ఎవరైనా నమ్మగలరా…?

ఆవును… ఆయన కామ్రేడ్ చారూ మజుందార్
అది… ఆయన చరిత్రగ మలిచిన నక్సల్బరీ
ఆయన… అప్పటికీ.ఎప్పటికీ విప్లవానికి పర్యాయ పదం. ఆయన… విముక్తికి ఏకైక నిర్వచనం.

ఎవరైనా ఒకటో రెండో విప్లవ కార్యమాల్లో పాల్గొని, దాన్నో పచ్చబొట్టుగా చూపించుకొని మురిసిపోతారు. కానీ అజన్మాంత విప్లవకారుడు గా జీవించడం, మరణించడం మహత్తరమైన విషయం. అది పలప్రదమైన ప్రజాజీవితం. 1967 లో జరిగిన నక్సల్బరీ రైతాంగ సాయుధ తిరుగుబాటుకు ముందు ఎప్పుడూ వినిపించని చారూ మజుందార్ పేరు, ఇప్పుడు ప్రపంచంలోనే విప్లవం అనే పదానికి పర్యాయం.

1919 లో పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా సిలిగురిలో ఓ జమీందార్ కుటుంబంలో పుట్టిన కామ్రేడ్ చారూ మజుందార్ సిలిగురిలో మెట్రిక్ వరకు చదివారు. తూర్పు బెంగాల్ ఆర్ట్ కాలేజీలో చేరినప్పటికీ తనలోని పోరాట స్వభావం చదువునో కొనసాగానీయలేదు. పీడితప్రజాఉద్యమాల్లో చేరి రైతు పోరాటాల్లో మమేకమయ్యారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యుడై “తెభాగా” పోరాట నాయకుల్లో ఒకరయ్యారు. ట్రేడ్ యూనియన్ నాయకులు గా దొమోహానియా లోని బెంగాల్ దువార్ కార్మికులను ఆర్గనైజ్ చేసారు. సహజంగానే మిలిటెంట్ కావడంతో, ఎంతో మిలిటెంట్ గా జరిగిన ఆ పోరాటంలో పోలీసుల కాల్పుల్లో12మంది స్త్రీపురుషులు చనిపోయారు. దానికి భాద్యుడ్ని చేస్తూ పార్టీ ఆయన్ని తీవ్రంగా మందలించింది.

పార్టీ నిషేధకాలంలో పలుమార్లు అరెస్ట్ అయ్యారు. లెక్కలేనన్ని చిత్రహింసలు చవిచూశారు. తెలంగాణా సాయుధ పోరాటానికి తిలోదకాలు వదిలి పార్టీ పార్లమెంటరీ రాజకీయాల్లోకి దిగడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. విజయవాడలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ 7వ మహాసభలో విభేదాలు బయటపడి 1964 లో సి పి ఎం ఏర్పడింది. దానిలో కొనసాగిన ఆయన రివిజనిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. చైనా పంథాకు అనుకూలంగా, మిలిటెంట్ పోరాటాలకు శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో ఆయన రాసిన డాక్యుమెంట్లని, ఇచ్చిన పిలుపును వ్యతిరేకించిన పార్టీ ఆయనను పార్టీనుంచి బహిష్కరించింది. అదే సమయంలో నక్సల్బరీ లో జోతేదారులకు వ్యతిరేకంగా రైతాంగపోరాటాలు ఉవ్వెత్తున లేచాయి. ఆయన తన సహచరులైన జంగల్ సంతాల్, కానుసన్యాల్ ల లతో కలిసి ఆ తిరుగుబాటు కు నాయకత్వం వహించారు. నక్సల్బరీ లో రైతాంగం ఎత్తిన తుపాకీ, చిందించిన నెత్తురు దేశవ్యాప్తంగా నిప్పురవ్వను రగిలించింది. పెనుమంటై విస్తరించింది. సాయుధ పోరాటమే కార్మిక, కర్షకల్ని తరాల దోపిడీ నుంచి విముక్తి చేస్తుందని, పార్లమెంటరీ రాజకీయాలు మోసపూరితమైనవని నక్సల్బరీ ఎలుగెత్తి చెప్పింది. భారతదేశంలో “వసంత మేఘ గర్జన ” అని చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ తిరుగుబాటుని కొనియాడింది.

దేశవ్యాప్తంగా యువత కదిలింది. పోరాటాల్లోకి దూకింది.1968 లో దేశవ్యాప్త విప్లవకారులు అంతా కలిసి సమన్వయ కమిటీ ని ఏర్పాటుచేశారు కానీ అప్పటికే పార్లమెంటరీ రాజకీయాల్లో తలమునకలై ఉన్న నేతలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాయకులు కామ్రేడ్ చారూ మజుందార్ నాయకత్వాన్ని, ఇచ్చిన పిలుపుని అంగీకరించలేక పురిటిలోనే కమిటీని చీల్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే రగిలిన శ్రీకాకుళం, దేబ్రా గోపీ వల్లవపూర్, ముషాహారీ, ముజఫర్ పూర్ గెరిల్లా పోరాటాలు పార్టీ ఏర్పాటు దిశగా ఐక్యమయి రివిజనిజాన్ని తుత్తునియులు చేశాయి. కామ్రేడ్ లెనిన్ జయంతి రోజున 1969 ఏప్రిల్22 వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్ట్) ఆవిర్భవించింది. అదే ఏడాది మే1 వతేదీన కలకత్తాలో భారీ ఊరేగింపు జరిపి, షాహీద్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో కామ్రేడ్ చారూ మజుందార్ కార్యదర్శిగా పార్టీ ఏర్పడినట్టు ప్రకటించారు.

భారత రైతాంగ సాయుధ విప్లవానికి కామ్రేడ్ చారూ మజుందార్ సమకూర్చిన సైద్ధాంతిక సంపద, ఆచరణలో తలెత్తిన సమస్యలకు ఆయన చూపిన పరిష్కారాలు అమూల్యమైనవి. గొప్ప మార్క్సిస్టు – లెనినిస్ట్ తాత్వికుడైన ఆయన మావో ఆలోచనా విధానాన్ని సృజనాత్మకంగా మనదేశ ప్రత్యేక పరిస్థితులకనుగుణంగా అన్వయించాడు. గతతార్కిక పరిశీలకుల అధ్యయనం ప్రకారం భారత విప్లవ తాత్విక చరిత్రకు కామ్రేడ్ చారుబాబు అసమాన్యమైన, అమూల్యమైన రెండు కానుకలను అందించారు. మొదటిది వర్గశత్రు నిర్మూలన, రెండవది నూతన మానవుని భావన. భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలోనే అన్ని రకాల రివిజనిజాల్ని ఎదిరించి, రాజీలేని పోరాటాన్ని జీవితాంతం సాగించిన మేటి విప్లవకారుడిగా కామ్రేడ్ చారూ మజుందార్ చిరస్థాయిగా నిలుస్తారు.

అతివాద దుస్సాహాసిగా, అర్ధం లేని హింసాకారుడిగా ఎన్ని విమర్శల్ని, దుమారాల్నీ ఎదుర్కొన్నప్పటికీ “ఎన్నికలని, పార్లమెంటరీ పదవులనీ బహిష్కరించండి ” అనే నినాదమిచ్చి, వర్గశత్రు నిర్మూలన విధానాన్ని అమలుపరిచి, రివిజనిజానికి ʹఆర్థిక సూటిదారైనʹ విధానాన్ని వమ్ము చేశారు. వర్గశత్రు నిర్మూలన గెరిల్లా పోరాటానికి నాంది, వర్గపోరాటం యొక్క అత్యున్నత రూపమని సూత్రీకరించారు. ఒకమనిషిని మరోమనిషి, ఒక వర్గాన్ని మరో వర్గం దోపిడీ చేసే వీలులేని సమసమాజ నిర్మాణం కోసం తమ ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించి, సర్వస్వం త్యాగం చేసే కొత్త మనుష్యులు కావాలి. ఆ కొత్త మనుష్యులు ద్వారానే కొత్త సమాజం సృష్టించబడుతుందనేది కామ్రేడ్ చారుబాబు మహోజ్వల భావన.

చైనా కమ్యూనిస్టు పార్టీ పేర్కొన్నట్టు “భారత పీడిత రైతాంగ సాయుధ పోరాటానికి కామ్రేడ్ చారూ మజుందార్ పర్యాయపదం. భారతదేశ విప్లవానికి వెలుగునిచ్చే జ్యోతి.” (సోషల్ మీడియా సౌజన్యంతో)

పీడన ఉన్నంతవరకు
పోరాటం ఉన్నంతవరకు
ఆ మూర్తి – మరుపురాదు
ఆ స్ఫూర్తి – చెరిగిపోదు.

” కలలు కనలేని వాడు,
ఇతరులను కలల్లో ముంచెత్తలేని వాడు
విప్లవకారుడు కాలేడు. “
కామ్రేడ్ చారూ మజుందార్.

-మోహన సుందరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X